Thursday, December 17, 2015

అస్పష్టంగా..


ఏదో వెనకటి కాలమేదో చొక్కా కాలర్
పట్టుకుని గుంజినట్టు
ఒక్కసారిగా నిన్ను నువ్ కాచుకోలేక
ఒరిగిపోతావ్

నీ చుట్టూ ఏవో నీవి కానివేవో కుప్పగా
పేరుకుపోయి ఊపిరిసలపక 
గిలగిలా కొట్టుకొని కనుల ముందో
అస్పష్టపు చిరిగిన తెర

వెన్నులో ఒక్కసారిగా ఏదో కస్సున దిగినట్లు
బాధగా గొంతులో ఓ మూలుగు
నువ్ అలా విరిగిపోయిన చెట్టు కొమ్మలా
నిశ్చేష్టుడవై రెక్కలు వెనక్కి విరిచి

కాలమలా అంగలు వేసుకుంటూ 
నిన్ను దాటుకుంటూ పోతూ
విసిరేసిన
ఓ సగం కాలిన
కల 
నీతో
సంభాషిస్తూ!!?

Wednesday, December 9, 2015

కొంచెం అలసటగా..


ఓ దిగులు తెర ఏదో కప్పబడి
కొద్దిగా ఒరిగి ఇటు జరిగి
ఈ అలికిన మట్టి గోడ వారగా
ఒత్తిగిలి

ఓ మాట రాని సైగ ఏదో
కంటి చివర మెరసి మాయమై
నువ్వొక్కడివే దేహమంతా జ్వరం
పాకుతున్న సమయంలో

తెల్ల గన్నేరు పూవొకటి రాలి
చల్లగా తాకిన వేళ
నువ్వలా మాగన్నుగా
నిదురలోకి జారి

 
పలవరింతగా
తేలిపోతావు!!

Wednesday, December 2, 2015

Last Line!


ఇప్పుడో కత్తి సర్రున
నీ మెడపై దూసుకు వస్తూ చిన్నగా దూదిలా
తాకీ తాకనట్లు కోస్తూ పోతూ వున్నప్పుడు


అధాటున నువ్వలా జారి నేలమీదకు
ఒరిగి కాసేపు చిమ్మిన నెత్తురునలా 
ఒడిసిపట్టిన వేళ


ఆ ఆకు చివర కరుగుతున్న మంచు బిందువొకటి
చివరిగా నీ కనురెప్పలపై జారి


ఐమూలగా దాగిన కల నీలోకి ఇగిరిపోయి
ఆఖరుగా ఓ మాట మౌనంగా శబ్దాన్ని
ఛేదిస్తూ...

Tuesday, December 1, 2015

అబ్నార్మల్!!


ఈ ఏటి ఒడ్డున ఏ తెరచాపా ఆగదు
ఇగిరిన తేమ దాహం తీర్చదు

కలలు రాని కనుల రెప్పల మీద విరిగిన 
సీతాకోకచిలుక రెక్క

నువ్వంటావు
మరల మేఘమేదో కురుస్తూ మొలకెత్తుతుందని

కానీ
గొంతు తెగిన కోయిల
పాట నెత్తుటి వాసనేస్తూ నిదురపోనివ్వదు!!
Related Posts Plugin for WordPress, Blogger...