Saturday, April 30, 2011

అక్షర సూరీడు..



సాహితీ వినీలాకాసంలో ఉదయించి అస్తమించని
ఎర్ర సూరీడు శ్రీశ్రీ

అటూ ఇటూ ఊగిసలాడిన సాహిత్యపు త్రాసు ముళ్ళును
తన తీక్షణ మైన ద్రుక్కోణంతో శ్రమజీవుల వైపు
మొగ్గేట్లు చేసిన శ్రమ పక్షపాతి శ్రీశ్రీ

శ్రమైక జీవన సౌందర్యాన్ని తొలిసారి దర్శించిన
దార్శనికుడు శ్రీశ్రీ

మరో ప్రపంచాన్ని మనసారా ఆహ్వానించిన
మాహా స్వాప్నికుడు శ్రీశ్రీ

ఉష్ణ రక్త కాసారాన్ని మరిగించి ఉవ్వెత్తున
విప్లవ జ్వాలలు రగిలించిన అక్షర సూరీడు శ్రీశ్రీ

నేను సైతం నేను సైతం అంటూ
జగన్నాధ రధ చక్రాలను భూమార్గం పట్టించి
అధికారం గుండెల్లో భూకంపం పుట్టించిన శ్రీశ్రీ

పుడమి తల్లికి పురుడు పోసి
కొత్త సృష్టిని అందించిన శ్రీశ్రీ

తానొక్కడే ధాత్రి నిండా నిండిపోయి
తెల్ల రేకై పల్లవించిన వాడు శ్రీశ్రీ

(మహాకవి 102 వ జన్మదినం)

Friday, April 29, 2011

ఆకాశమంత నేత్రంతో...



నేలంతా పచ్చదనం పరచుకున్న వేళ

దారులన్నీ వెలుగుతో పూస్తున్న వేళ

తరువులన్నీ తలవంచి స్వాగతమిస్తున్న వేళ

పక్షులన్నీ కువ కువలాలపిస్తున్న వేళ
గోమాత లేగదూడకు పాలిస్తున్న వేళ
అమ్మ ఒడిలో లాలిపాట వింటున్న వేళ
ఆనందం అర్ణవమై
అనురాగ వర్షంలో నే తడిసి ముద్దైన వేళ
నీ రాకకై ఆకాశమంత నేత్రుడినై
వేచి వున్నా...

(ఈ ఫోటో పంపి కవిత రాయమన్న నేస్తం కోసం)

Thursday, April 28, 2011

అలసిన మనసు



ఏదో చెరిగిపోతూ
కరిగిపోతూ
వెలసిపోతూ
రంగులొలికి పోయి అంతా కలగాపులగమై
చిందర వందరగా దారాలన్నీ చిక్కుపడి ఆది అంతం కోల్పోయి
భారంగా తేలికగా అయోమయంగా
ఈ రాతిరి ఈ నది ఒడ్డున
వెన్నెల రక్తమోడుతూ
నన్నొంటరిని చేసి వెళ్ళిపోయింది

Tuesday, April 26, 2011

'కవిశ్వాశ' వారి ప్రకటనః

'కవిశ్వాశ' వారి ప్రకటనః

సాహితీ మిత్రుల సూచనతో విగ్రహ విధ్వంసంపై అటూ ఇటూ వారి స్పందనలతో కవిశ్వాశ, విజయవాడ వారు కవితాసంకలనం ఆవిష్కరణ తేదీని 'మే, 28' నాటికి మార్పు చేసి కవితలను పంపించవలసిన ఆఖరు తేదీని మే, 20 నాటికి మార్పు చేసారు.. మే, 28న ప్రముఖ సాహితీ ఉద్యమకారులు సురవరం ప్రతాపరెడ్డిగారి 115 వ జన్మదినం సందర్భంగా సంకలనావిష్కరణ జరుగుతుందని తెలియజేసారు. సురవరంవారు తెలంగాణా పోరాటానికి మద్ధతుగా 300 మంది కవులతో గోల్కొండ కవులు అన్న కవితా సంకలనం, ఆంధ్రుల సంస్కృతీ-చరిత్ర అన్న ప్రసిద్ధ గ్రంధాలు వెలువరించారు..
పై ప్రకటనను గమనించి సాహితీ మిత్రులు తమ కవితలను మే-20 నాటికి ఈ దిగువ చిరునామాకు పంపించ గోరుతున్నారుః
కె.ఆంజనేయకుమార్,
28-17-6,
రామమందిరం వీధి,
అరండల్ పేట,
విజయవాడ -520002 - సెల్ నెం. 8985358149 (శిఖా ఆకాష్)
మైల్ ఐడిః venneladaari@gmail.com

Thursday, April 21, 2011

ధరిత్రీ దినోత్సవం



మొన్నో సునామీ
నిన్నో సునామీ
రేపెప్పుడో సునామీ
ముంచెత్తుతున్నా
నీ ఓటమిని నీవే ఖరారు చేసుకుంటున్నావు..
నీ చుట్టూ నీవే పొగబెట్టుకుంటున్నావు..
ఎక్కిన కొమ్మనే నరుక్కునే మూర్ఖత్వం మనది!

నియాంగిరీ పర్వత శ్రేణులనుండి
పాడేరు భూగర్భం వరకు
తవ్విపోస్తున్న బాక్సైటు నిల్వలు..

నర్మదా నుండి పోలవరం వరకు కడుతున్న
ఆనకట్టల గర్భంలో కలిసిపోతున్న నేల...

కోస్తా కారిడార్ పేరుతో విస్తరిస్తున్న
అణు, బొగ్గు కుంపట్ల నిర్మాణం...

నిన్నూ నన్నూ రేపటి తరాన్ని
పాతరేస్తాయని తెలిసినా
మూగగా తలలూపే నీ నా నిస్సహాయత
ప్రకృతి ముందు దోషిగా నిలబెడ్తున్నాయి!

నీ కాంక్రీటు అరణ్యవిస్తీర్ణంతో
అంతరించి పోతున్న పచ్చదనం
మన చివరి శ్వాశకు సంకేతం!

రండి తలా ఒక చేయి వేసి
ధరిత్రీ మాతను కాపాడుదాం...
(ఏప్రిల్ 22 ధరిత్రీ దినోత్సవం)

Wednesday, April 20, 2011

ఇంద్రవెల్లి



ఇంద్రవెల్లి
ఓ ఊరు పేరు కాదు నేడు...

ఈ దేశ మూలవాసీ నెత్తు రోడి ఎగరేసిన జెండా...

ఆ రెపరెపల నీడలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న పోరుకెరటం...

రాజ్యం దాష్ఠీకానికెదురు నిలిచిన గుండెనిబ్బరం...

అది గోండు కొమరంభీం ఎగరేసిన నెలవంక గురుతు....

ఈ నేల మాది ఈ అడవి మాది

ఈ ఏరు మాది ఈ నిప్పుమాది

ఈ నింగి మాది

ఇది ఓ స్వేచ్చా గీతిక...

పోలవరాలు, వాకపల్లి,
బాక్సైట్లు, వేదాంతలు,
జిందాల్ లు
నిలువ నీయకుండా చేస్తూనే వున్నవి...

మా నెత్తుటితో ఈ నేలను తడుపుతూనే వున్నవి...

గుండెల్లో గునపాలు దిగుతూనే వున్నవి...

కానీ ఇంద్రవెల్లి సాక్షిగా నియాంగిరీ పొలికేక పెడుతూనేవుంది...


ఇది శతాభ్దాల పోరు బాట...

నీకూ నాకు తప్పని యుద్ధం...

ఇది ఆస్తి తగాదా కాదు
మరో స్వాతంత్ర్య పోరాటం...
అలుపెరుగని స్వేచ్చా పతాకం....


(ఇంద్రవెల్లి హత్యాకాండ జరిగి ముప్పై ఏళ్ళు ఐన సందర్భం)

Sunday, April 17, 2011

అలాయి బలాయి




గోడలను బద్దలు కొట్టడమే
మన పని...

గుండె గది మూలల హద్దులను
సరిహద్దులను చెరిపేయడమే
తక్షణ కర్తవ్యం...

ఆనకట్టలు వేయొద్దు
జలజలా పారనీయండి
మనసు జలపాతాలను...

రెక్కలను కత్తిరించనీయవద్దు
నింగిదాకా ఎగరనిద్దాం...

రెప్పల చుట్టూ వున్న కంచెలను
కూలుద్దాం...

చేతులు బార్లా చాపి
అలాయి బలాయి చెప్పుకుందాం...

శుభోదయం



కరిగిపోతున్న వెన్నెలనింత

గుప్పిట బంధించి

తొలికిరణాన్ని

కనురెప్పలపైగా

గుండెమూలలాహ్వానిస్తూ

మిత్రులందరికీ

శుభోదయం..

Saturday, April 16, 2011

విగ్రహ విధ్వంసంపై కవితలకాహ్వానం

విగ్రహ విధ్వంసంపై కవితా సంకలనం

హైదరాబాద్ టాంక్ బండ్ విగ్రహ విధ్వంసంపై వచ్చిన కవితలను సంకలనంగా తీసుకురావాలని 'కవిశ్వాశ' (Poetry circle), విజయవాడ నిశ్చయించింది. ఇరువైపులా వచ్చిన కవితలతో ఒకే వేదికపై విన్పించడానికి 'మేడే' రోజు ఉదయం ఆవిష్కరింపబడే ఈ సంకలనానికి కవితలను పంపించవలసిన ఆఖరు తేదీ April-25.

చిరునామాః
K.Anjaneyakumar,
Dr.No.28-17-6,
Ramamandiram Street,
Arandelpeta,
Vijayawada - 520 002..
Cell No.8985358149 (శిఖా ఆకాష్)

Saturday, April 9, 2011

నేను ప్రకృతిని



వెన్నెల చల్లదనాన్ని
సూరీడి వెచ్చదనాన్ని
పదిలంగా దాచుకున్నవాణ్ణీ!

అడవి పరిమళాన్ని
ఊపిరినిండా శ్వాశించినవాణ్ణి!

సంద్రపు అలల సవ్వడిని
వలలో బంధించిన వాణ్ణి!

గలగల పారే సెలయేళ్ళ
సంగీత ఝరిని
ఆలాపన చేసిన వాణ్ణి!

తొలకరి పులకరింతలో
మట్టి వాసన నిండుగా
పూసుకున్న వాణ్ణి!

ఆమనితో పాటు
శిశిరాన్ని ఎరిగినవాణ్ణి!

వడిసెల రాయిని
గురిచూసి విసిరిన వాణ్ణి!

లోపలితనాన్ని
గుండెలో భద్రంగా
దాచుకున్న వాణ్ణీ!

నేను ప్రకృతిని....

Thursday, April 7, 2011

నవ్వొస్తోంది...



స్వేచ్చగా వీచే
గాలిని పిడికిట పట్టే
నీ మూర్ఖత్వం చూస్తే
నవ్వు వస్తోంది...

వెన్నెల చల్లదనాన్ని
గదిలో బంధించ జూచే
నీ అహంకారాన్ని చూస్తే
నవ్వు వస్తోంది...

ఉదయించే సూర్యున్ని
అడ్డంగా నిలబడి
ఆపేద్దామన్న
నీ ఆరాటం చూస్తే
నవ్వు వస్తోంది...

గల గల పారే సెలయేళ్ళను
సీసాలో పట్టేస్తానన్న
నీ ప్రయాస చూస్తే
నవ్వు వస్తోంది...

Sunday, April 3, 2011

వసంతగానం..


శిశిరంలో కప్పుకున్న
మంచుదుప్పటి
తెరలను విదుల్చుకొని
ఎండిన మోడులన్నీ
ఎర్రెర్రని
లేలేత చివుళ్ళతో
చిగురాశల
పూతతో
గాయపడ్డ
హృదయాలను
స్వాంతన పరుస్తూ
వెదురుపూల వనం
చల్లని
వేణు గానాలాపనతో
కువ కువల రాగంతో
వసంతాన్ని
దేహమంతా
చేతులై ఆహ్వానిస్తూ...

(మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు)
Related Posts Plugin for WordPress, Blogger...