Wednesday, December 29, 2010

ప్రశ్నను ఉరివేయగలరా?




ప్రశ్న
ఇది ఆది నుండి
అందరి గొంతులో దిగబడుతున్న
కర్కశ శూలం
తట్టుకోలేనితనంతో
అంతా దానిని పాతరేయజూస్తుంటే
మరల మరల అది
నిటారుగా మొలుస్తూ
జూలు విదిలించి
తన కొక్కేనికి నీ పీక
తగిలిస్తోంది...

ఎంత ఓర్చుకోలేనితనం
ఒక్కమారుగా గుంపుగా మందలా
పడి దాన్ని నలిపేయ నమిలేయ
జూస్తే పళ్ళమధ్య ఇరుక్కొని
కుక్క ఎముకను
కొరుకుతూ తన పళ్ళసందుల
కారే నెత్తురు రుచికి ఆహా అనుకున్నట్లు
తన్మయత్వంలో వున్నావా?

ఆగాగు
యుగాలుగా దానిని ఉరితీసి
ఊపిరి పీల్చుకుందామనుకుంటే
అది నీ మెడ చుట్టూ
బిగుసుకుంది చూడు...

(ఆదివాసీ హక్కుల కార్యకర్త డా.బినాయక్ సేన్ పై మోపబడ్డ దేశద్రోహ నేరమూ-శిక్షకు వ్యతిరేకంగా)

కవిత్వమె దేహమై ఆత్మైన గుడిహాళం స్మృతిలో..

"నేల రహస్యం ఎంతగా తెలుసో
చెట్టుకి
ఆకాశ రహస్యమూ అంతగా తెలుసు
పాతాళం వేడి ఒత్తిడి తెలిసిన జలమే
గగన సీమల్లో విహరించగల్దు"

అని గగన సీమల్లోని రహస్యాన్ని చేదించడానికి నింగికెగసిన విపశ్యన కవి మిత్రులు, రచయిత, పాత్రికేయులు గుడిహాళం రఘునాధం ఏభై నాలుగేళ్ళకే తెలుగు నేలను విడిచిపోవడం అత్యంత విషాదం..

తొంబైలలో వచ్చిన ఆయన ఫోర్త్ పెర్సన్ సింగ్యులర్ కవితా సంకలనం కవిత్వ రంగాన ఎలుగెత్తిన కొత్త గొంతు. పద్యంలో ఇమడాల్సిన అందం గురించి తెలిసిన కవితా సౌందర్య పిపాసి. రాత్రినడిచిన జాడ ఇంకా చెరిగిపోలేదు. మనమంతా తప్పక హృదయాగ్నిలో ఈ కవిని స్నానం చేయనిద్దాం... (ఇవన్నీ ఆయన కవితా పాదాలనుండే)..



ఇక్కడ సుంకిరెడ్డి రాసిన నివాళి చదవండి

Tuesday, December 14, 2010

విషాదం?
















౧.రోడ్లు
వెడల్పు అవుతున్నంత సులభంగా
మనుషుల మనసులు
విశాలం కావట్లేదెందుకో??

౨.చెత్తనూడ్చినంత సరళంగా
మనసును శుభ్రపరచలేమెందుకో??
Related Posts Plugin for WordPress, Blogger...