Saturday, October 2, 2010
నేనూ మా నాన్నగారూ ఓ ర్యాలీ సైకిల్
బడిలో ప్రార్థనకు ముందుగా
గేటు వద్ద దింపకపోతే తన
కొడుకు అరచేయిపై పడే ఎఱ
చారలనూహించుకొని
అప్పుడే తిన్న పేగుల్నొప్పిని
పైపంటితో భరిస్తూ స్పీడుగా
వెళ్ళలేనని మొరాయిస్తున్న
సైకిల్ పెడల్ పై శక్తినంతా పెట్టి
తొక్కిన మీ పాదాలను
నమస్కరించకుండా ఎలా వుండగలను
నాన్నగారూ..
సైకిల్ సొంతంగా తొక్కితే
పడి మోకాలుపై చర్మం వూడితే
ఇంకెప్పుడూ సైకిల్ తొక్కనివ్వని
మీ అవ్యాజ ప్రేమ
నన్నిప్పటికీ దానికి దూరం చేసిందని
తలచుకున్నప్పుడంతా నవ్వే
మిమ్మల్ని చూస్తూ
నా భయానికి నాకే సిగ్గేస్తోందిప్పుడు!
హాయిగా మీ గుండెలపై వాలి
ఇప్పటికీ వేళ్ళమధ్య రోమాలనిరికించి
ఆడుతూ నిదరపోవాలనివుంది...
Subscribe to:
Posts (Atom)