Sunday, September 5, 2010

కాస్తంత ఎండను ఆహ్వానిద్దాం..




ఎప్పుడూ చలువరాతి గదుల్లోనేనా!
కాస్తంతా ఎండను కూడా ఆహ్వానించండి

ఎండ మీ గుండె గదిమూలల్లో
తగిలేలా బార్లా తలుపులు తెరిచి వుంచండి..

గాభరాగా బయటకు వచ్చి
తుఱున మరల లోపలికి ముడుచుకుపోయే
స్ప్రింగ్ డొర్ లను అడ్డుపెట్టి ఆపండి
లేదా బద్దలుకొట్టి బయటపడండి..

ఎండ జీవితంలో సుఖ దుఃఖాలకు సంకేతం..
దాని రూపు తెలీకపోతే
మీతో పాటుగా మీ మెదడు కూడా
నాచు పట్టిపోగలదు..

కాస్తంత ఎండను ఆహ్వానించండి
గట్టిగా నేలను తన్నిపెట్టి
శక్తినంతా పాదాలలోకినెట్టి
పైకెగరండి..
ఆకాశపుటంచులతాకే చేతులకు
అంటిన మబ్బుల చల్లదనం
ఎరుకౌతుంది...

కాస్తంత ఎండను ఆహ్వానించండి
ఎదను హత్తుకున్న మీ
మిత్రుని గుండెలయ మీ
గుండెపొరల ద్వారానే తెలుసుకోండి..
మీలోకి పాకిన తన రక్తచలన
సంగీతాన్ని చెవులారా విని
గొంతులో స్వేచ్చా గీతాన్ని
జుగల్బందీగా గానం చేయండి..

ఎల్లలు చెరిగిన నిర్వాణక్రమాన్ని
అనుభూతిచెందండి..

కాస్తంత ఎండను ఆహ్వానిద్దామా?
Related Posts Plugin for WordPress, Blogger...