Saturday, September 19, 2009

నీవు వదలిన నీ నీడ జాడలో

desert

ఈ విశాల జీవన ఎడారి తోవలో

నీవు వదలిన పాద ముద్రలను వెతుకుతూ

అనంత తీరాల వెంబడి అణ్వేషణ సాగిస్తున్నా!

ఇవి ఒట్టి ఇసుక రేణువులా… కాదు

నీ అడుగు జాడల వెంబడి విరిసిన నక్షత్ర ధూళి!

నన్ను ఈ ఎండమావుల వదిలి నీవు

కానరాని తీరాల వెంట పయణమగుట భావ్యమా?

ఈ ఎడారి మూపున చిగురించిన

సగం కాలిన నెలవంక నీడల వెనక

నీవు వదలిన నీ నీడ జాడలో

నా ఈ వెతుకులాట…

సుదూరంగా

నీ నవ్వుల ఒయాసిస్సు

కనురెప్పల తెరల మాటుగా…..

Wednesday, September 9, 2009

ఎలాగోలా….

ఎలాగోలా బతికేయడానికి అలవాటుపడ్డాం

ఎవరేమనుకున్నా సరే

మనం, మన కుటుంబం, మన మోటారు సైకిలు/కారు

మన సెల్ బాలంస్, మన ఏ.టి.ఎం. కార్డు బాలెంస్

ఉంటే ఎవరెలా పోతే నాకేంటి,

నా పిల్లవాడి కాన్వెంట్ సీట్/కార్పొరేట్ కాలేజి చదువు

దొరికితే చాలు..

మంచి – చెడుల మద్య నున్న సన్నటి తెరను

చించేసుకుని బురఖాగా వాడుకుంటూ

నెపం ఎవరిమీదకో నెట్టేస్తూ

రోలింగ్ స్టోన్లా రోజులు దొర్లించేస్తున్నాం!

నిత్యం ఆత్మను చంపుకుంటూ చస్తూ బతుకుతున్న

బతుకూ ఒక బతుకేనా అని అర్ధరాత్రి

దుప్ప్టట్లో ప్రశ్నించుకొని తెల్లారి

మరల నుదుట నామంతో ప్రత్యక్షమవుతుంటాం!

ఎన్నాళ్ళీ మోసకారి బతుకులు?

అతకని మనసుల జతలు..

ప్లాస్టిక్ పువ్వుల నవ్వుల రువ్వులు..

Monday, September 7, 2009

అడవీ తల్లీకి దండాలో..

అడవి తల్లీకి దండాలో

మా కన్నతల్లీకి దండాలో…

అని గట్టిగా గొంతెత్తి పాడాలని వుంది

తన కడుపులో గుట్టుగా దాచుకున్న బిడ్డలను

మాటాడుదాం రమ్మని నమ్మకంగా ఇంత ముద్ద పెట్టి

వారు అడిగిన ఐదూళ్ళ వాటాను ఇవ్వలేదు సరికదా

తిరిగి తమ గూటికి ఆ పక్షులు చేరకముందే వారిని

దారికాచి గొంతుకోసిన నాటి నుంచి ఆగని నీ

కన్నీటి ధార మొన్న కుండపోతై, మెరుపుల జడివానై

వాడి అంతుచూసాక కాని నీ ఆక్రోశం చల్లారలేదు!

నీ వాకపల్లి పుత్రికల ఆవేదనకు ఇలా ముగింపు నిచ్చావు!

భూమ్మీదకాని, సముద్రంలోకానీ, ఆకాశంలోకాని, దేనివలన

మృత్యువులేదని వరం పొందిన నయా హిరణ్యాక్షుడికి

నీ మూడో నేత్రంతో మాడి మసిచేసావు!

పావురాల గుట్టకు మా పడి పడి దండాలు..

నీకు మా పొర్లు దండాలు తల్లి.

Related Posts Plugin for WordPress, Blogger...