
మీరు నడిచినంత మేరా
వెలుగు పూలు
మీ నవ్వుల కాంతితో
ఈ జగమంతా
వెలుగు పూలు
మీ ఆత్మీయ
కరచాలనంతో
మనసంతా
వెలుగు పూలు
మీరు వదిలిన
జ్నాపకాలన్నీ
మాకు
వెలుగు పూలు

ఇక్కడేదో వాన ముందర
మబ్బులు కమ్మి
మసక బారినట్లు వుంది
తుఫాను ముందర
సంద్రం ప్రశాంతంగా అగుపిస్తున్నట్లుంది
మౌనాన్ని అంగీకారంగా
ఓటమికి చిహ్నంగా మారుద్దామన్న
తాపత్రయంతో వాళ్ళు ముంచుకొస్తున్నారు
కానీ
వేసిన వెనకడుగు
మరిన్ని బారల దూరాన్ని
అధిగమించడానికేనన్న
ఎరుకతో వుండండి..
నిశ్శబ్ధం బద్దలై
వసంత మేఘం గర్జించి
వర్షించే సమయుం
ఆసన్నమైంది...
ఇన్నాళ్ళు పొగిలి పొగిలి
ఏడ్చిన కనులే
నేడు విస్ఫులింగాల్ని
కురిపించనున్నాయి...
మోసపోయి పోయి
దగాపడ్డ జనమంతా
దండై నేడు
కదులుతున్న క్షణాన
ఢిల్లీ పీఠం కదలబారుతున్నది
ఎగరనీ ఎగరనీ
స్వతంత్ర తెలంగాణా
ఝెండా
నయా వలస పాలకుల
గుండెలపై...


ఇప్పుడేదో అంతా
ఎడారి పరుచుకున్నట్లు
పాదాలు ఎర్రని ఎండలో
కూరుకుపోతున్నట్లు
అరచేతులలో తడి
ఆరినతనం..
దేనిని తాకినా
ఏదో రబ్బరు తొడుగు
దేహమంతా
కప్పబడినట్లు
స్పర్శ కోల్పోయినతనం..
కనుల లోయలో
పరచుకున్న
ఎండమావులు....
గాజు కళ్ళుగా
మారిపోయాయన్నట్టు
ఏదీ ఇంకనితనం..
అంతా రంగు రుచి లేని
కషాయంలా గొంతులో
ఏదో విషం దిగుతున్నా
బాధ తెలియని
శిలాజంలా...
ఒంటరితనంవైపు
మొగ్గుతూ బాహ్యాంతరాలలో
ఏదో నిషేధ ఘోష
చుట్టూరా కమ్ముకున్న
ఈ సమ్మె వాతావరణంలో
నాలుక పిడచకట్టి
గొంతెండిన వేసవితనం
వెంటాడుతోంది...
ఎక్కడో దాగిన కాసింత
కన్నీటి ఊట
నన్నింకా ఇలా
మనిషిలా(?)
నీముందు...
(ఈ కవిత ముందుగా 'పొద్దు' లో వచ్చింది)
ఇక్కడ గలగల పారే జీవనదులు
నాగావళి, వంశధారలతో పాటు
జంఝావతి, వేగావతి, గోస్తనీ,
చంపావతి, మహేంద్ర తనయ...
ఇంకా ఎన్నో ఎన్నెన్నో నదులు,
సెలయేళ్ళు, వాగులు, వంకలు
ఊటలు, పిట్టల కిలకిలా రావాలు,
పచ్చాపచ్చని అడవులు, సక్కని సుక్కలమల్లె పల్లెలు
సిన్నసిన్న పట్టణాలు, ఇసాకపట్నం నగరం,
ఇవన్నీ జూసి కన్నుకుట్టీ
బొగ్గు నిప్పుల కుంపట్లన్నీ
మా గుండెలపై రాజేస్తావా?
మా నెత్తిపై అణు బాంబునెత్తి
మా నేల పచ్చదనాన్ని భగ్గున మండిస్తావా?
మా సేపల వలలెత్తుకెల్లి
మరపడవలతో మా సంద్రం కడుపులో
దేవుకు పోతావా?
మా నట్టింట్లో కొచ్చి బంగరు
గనులన్నీ కాజేస్సి
మా కొండఫలాల్ని ఎత్తుకుపోయి
మా బూములన్నీ బుగ్గిజేసి
మా నీళ్ళన్నీ ఇసంజేసి
మా దీపాల్ని ఆర్పేయజూస్తావా?
మా బతుకులు సెడగొట్టడానికొస్తే
నీ పీక కోసి తలకాయ మా బొబ్బిలి
కోట గుమ్మానికి ఏలాడదీస్తాం!













శ్రీశ్రీ... ఓ పోరాట రూపం
శ్రీశ్రీ... ఓ సామాన్యుడి అంతరాత్మ
శ్రీశ్రీ... స్పార్టకస్ ఖడ్గం
శ్రీశ్రీ... వేల ప్రశ్నలకు జవాబు
శ్రీశ్రీ... జగన్నాద రథ సారథి
శ్రీశ్రీ... సమస్త వృత్తుల సహస్ర చిహ్నం
శ్రీశ్రీ... విశ్వమానవాళి కన్న మహా స్వప్నం
శ్రీశ్రీ... మరోప్రపంచపు ఎఱబావుటా నిగనిగ
శ్రీశ్రీ... అనంత విశ్వంపై ఎగిరిన తెల్లబావుటా ధగధగ








