Tuesday, October 27, 2015
సిద్దార్ధ మిస్ యూ!!
Wednesday, December 26, 2012
కళ్ళే...
ఇప్పుడు కళ్ళే శిశ్నాలుగా
తిరుగుతున్నాడు వీడు..
మృగాడు అని రాయొద్దు..
పాపం అమాయక జంతువులేం చేసాయి..
యుగాలైనా మారని వీడు
తల్లిని కూడా వాంచతో ఎక్స్ రే తీస్తాడు..
మాంసం ముద్దలుంటే చాలు వీడి కళ్ళకి
చొచ్చుకు పోతాడు...
కడుపునిండా కోరిక నిండిన వీడికి
ఆ కళ్ళను పెరికేయడమొక్కటే సరైనది...
Tuesday, November 29, 2011
వాడి నెరవేరని కల
ఎప్పుడూ వాడికొకటే కల
తనకు నిద్ర పట్టనివ్వని వాణ్ణి
అంతం చేసేద్దామని...
వేల తుపాకులు భుజానేసుకొని
కవాతు చేస్తూ భయం భయంగా
నక్కుతూ నీల్గుతూ మూల్గుతూ
అడుగులేస్తూ
ఎదురుగా
వెన్నెలతో జలకాలాడుతూ
కోరమీసం మెలేస్తూ
నెగడు చుట్టూ థింసా ఆడుతున్న
వాడి గుండెల్లో తూటా దించేసి
హాయిగా ఊపిరి పీల్చుకుందామని...
కానీ,
నెగడులోంచి ఎగసి పడుతున్న నిప్పురవ్వలు
ఒక్కొక్కటి వేల సూరీళ్ళుగా ఉదయించడం
చూసి మరల నువ్వు
బురదపాములా ఊబిలో కూరుకు పోయావు....
చూసావా
నా అప్రియ శతృవా??
Thursday, June 30, 2011
అన్నపూర్ణా....

ఏడ దాగినావమ్మా...
రైతై పుట్టిన పుణ్యానికి
ఈ నేలమీద మీసం మెలేయలేక పోయినా
కడుపు నిండా యింత వన్నం తిందామన్న
ఆశతో వేసిన పంట చేతికి రాక
అప్పుల ఊబిలోంచి ఎలా బయటకు దూకాలో కాన రాక
కాలూ చేయీ ఆడక
పురుగుల మందే పరమాన్నమైనట్టు తిని
తాను మమ్మల్నిలా వొంటరి చేసి పోతే
ఇలా మిగిలిన పాపం వీరిదా?
నాదా?
Thursday, June 2, 2011
కాసింత చోటును వదలండి...

కాసింత చోటును వదలండి...
మాకింక కాలు మోపడానికి
ఇంత జాగా
మిగలనివ్వండి...
మూడు ఇటికలు పేర్చుకొని
ఇంత బువ్వ వండుకొనే
చోటు కూడా మిగలకపోతే ఎలా?
నెత్తిన చుట్టిన తుండు గుడ్డ
తీసి తలకింద వుంచుకొని
మోచేయిపై ఆన్చి చిన్న
కునుకు తీసే స్థలమైనా లేకపోతే ఎలా?
చుట్టూ కంచెవేసుకుంటూ
పోతుంటే చివరకు
కాటికి కూడా మిగలక
మీ గుండెలపై కాల్చాల్సి వస్తుంది...
Thursday, February 10, 2011
ఆది యందు అంతమందు నేనే
శూన్యమా అది
కాదు అక్కడా
నోట్ల రెపరెపలే
ఒకటా రెండా
లెక్కపెట్టనీకి
నీవి మున్నూరు
జీవితాలు కావాలె...
ఆద్యంతములు
ఖాళీగా వదలని
అవినీతి భూతం
వికటాట్టహాసం
నాలుక లేని
నాయకునికి
చేతులూ లేవు...
డొక్కనిండనీకి
జనం
రెండొందల
పెన్సన్ డబ్బులకు
క్యూలో
విదిల్చనీకి
ఇంక
ఎంగిలి మెతుకులూ
లేకుండా
నాకి పారేస్తున్న
నాయకుల
అరచేతి కింద
నీడ కూడా
భయపడి
దాక్కుంది...
కావుకావు మననీకి
కాకులూ లేవు
కరవనీకి
కుక్క పళ్ళకంద
బొమిక ఇరుక్కుంది
చల్ చల్ రే భాయి
జర దేఖో బహెన్
ఏక్ కఫన్
ఊంచా రహే హమారా...
Saturday, January 8, 2011
కళింగాంధ్ర గోస
ఇక్కడ గలగల పారే జీవనదులు
నాగావళి, వంశధారలతో పాటు
జంఝావతి, వేగావతి, గోస్తనీ,
చంపావతి, మహేంద్ర తనయ...
ఇంకా ఎన్నో ఎన్నెన్నో నదులు,
సెలయేళ్ళు, వాగులు, వంకలు
ఊటలు, పిట్టల కిలకిలా రావాలు,
పచ్చాపచ్చని అడవులు, సక్కని సుక్కలమల్లె పల్లెలు
సిన్నసిన్న పట్టణాలు, ఇసాకపట్నం నగరం,
ఇవన్నీ జూసి కన్నుకుట్టీ
బొగ్గు నిప్పుల కుంపట్లన్నీ
మా గుండెలపై రాజేస్తావా?
మా నెత్తిపై అణు బాంబునెత్తి
మా నేల పచ్చదనాన్ని భగ్గున మండిస్తావా?
మా సేపల వలలెత్తుకెల్లి
మరపడవలతో మా సంద్రం కడుపులో
దేవుకు పోతావా?
మా నట్టింట్లో కొచ్చి బంగరు
గనులన్నీ కాజేస్సి
మా కొండఫలాల్ని ఎత్తుకుపోయి
మా బూములన్నీ బుగ్గిజేసి
మా నీళ్ళన్నీ ఇసంజేసి
మా దీపాల్ని ఆర్పేయజూస్తావా?
మా బతుకులు సెడగొట్టడానికొస్తే
నీ పీక కోసి తలకాయ మా బొబ్బిలి
కోట గుమ్మానికి ఏలాడదీస్తాం!
Sunday, November 7, 2010
మాయల ఫకీరులు

ఏదో ఓ పెద్ద సునామీ కెరటం
ముంచెత్తడానికి
ముందున్నట్లు ఈ ప్రశాంతత..
ఆకాశమంత కమ్ముకున్న
మబ్బులు రైతన్న
మోముపై చూస్తూ
భూమిలోకి కుంగిపోతున్న
అనుభూతి...
కోతకొచ్చిన పంట 'జల'
వరదపాలౌతుందన్న
బెంగతో గొంతులో
ముద్ద దిగక
ఊపిరాడనితనం...
ఇంతలొ...
ఓ అరచేయి అందరి
నెత్తిపై గట్టిగా మోదుతూ
మోకాళ్ళపై మోకరిల్లమని
ఆజ్నాపిస్తున్నట్లు...
నోటికందిన ముద్దను
నల్లరెక్కల గెద్ద ఏదో తన్నుకు
పోతున్నది!
రెక్కలకింద దాగిన పిల్లలను
మరింతగా దాచుకునేందుకు
ఒదిగిపోతున్న కోడి
ఈకల సందుల్లో దూరుతున్న
సాటిలైట్ చూపుతో
సిగ్గుతో చచ్చిపోతున్నది..
మూసుకుపోతున్న
బాహ్య ఆధార దారులతో
నిరుద్యోగి గుండె సంద్రమౌతున్నది..
ఇక్కడి ధాతువులన్నీ
చాప చుట్టే పన్నాగంతో
వచ్చిన ఈ మాయల ఫకీరు
చిలకను కొట్టేందుకు
శిలకోలలెక్కుపెడుదాం...