Showing posts with label కవిత-మైత్రి. Show all posts
Showing posts with label కవిత-మైత్రి. Show all posts

Thursday, November 26, 2015

పారాహుషార్...


దూరంగా ఎన్నెలో ఎన్నెలా
అని ధింసా ఆడుతున్న పగిలిన పాదాలు

నెగడు చుట్టూ ఎగురుతున్న ఉసిళ్ళు వలె
ఆలోచనల కదలికలును పసిగట్టు చూపులు

చలిగాలికి కాసింత చల్లబడుతున్న కార్బన్
అరచేతికి తగులుతూ కాషనిస్తోంది

ఎండిన మోడు నీడ మేఘంతో పాటు
అటు యిటూ కదులుతూ ఉలికిపడుతోంది

ట్రిగ్గర్ పై చూపుడు వేలు బిగిస్తూ
ఈ ఎన్నెల మరింత ఎరుపెక్కుతూ ధారగా కురుస్తోంది

రెప్ప పడని కాలం సెకన్ల ముళ్ల చివర
టక్ టక్ మని తిరుగుతూ ఎలర్ట్ చేస్తోంది

పారాహుషార్ కామ్రేడ్ 
పారాహుషార్

Friday, April 29, 2011

ఆకాశమంత నేత్రంతో...



నేలంతా పచ్చదనం పరచుకున్న వేళ

దారులన్నీ వెలుగుతో పూస్తున్న వేళ

తరువులన్నీ తలవంచి స్వాగతమిస్తున్న వేళ

పక్షులన్నీ కువ కువలాలపిస్తున్న వేళ
గోమాత లేగదూడకు పాలిస్తున్న వేళ
అమ్మ ఒడిలో లాలిపాట వింటున్న వేళ
ఆనందం అర్ణవమై
అనురాగ వర్షంలో నే తడిసి ముద్దైన వేళ
నీ రాకకై ఆకాశమంత నేత్రుడినై
వేచి వున్నా...

(ఈ ఫోటో పంపి కవిత రాయమన్న నేస్తం కోసం)

Sunday, March 20, 2011

వేడుకోలు..











పుట్టుకతోనో,
చిన్ననాడో,
ప్రమాదవశాత్తుగానో,

శరీరాంగం తిరిగిరాని
మొలకలా
వెక్కిరిస్తూ
నిరంతరం
మనసును దొలుస్తూ...

అన్నీ
వున్నాయన్న

వాడి
వెకిలి చూపు

బాధిస్తూన్న

జీవితం
పట్ల

పోగొట్టుకోలేని
ప్రేమ
నిబ్బరంగా
వెలిగిస్తూ
ఆసరాగా
ఓ కఱ ఇచ్చిన
ఊతనివ్వలేని

వారి
నిర్జీవ మనసును

చూసి నవ్వుకుంటూ....


మీ మీ జాలితనం
మాకొద్దు
మిత్రులారా

అవిటితనంలేని
మనసు
కలిగివుంటే
చాలని విన్నపం...

(నేడు వికలాంగుల దినోత్సవం సందర్భంగా)

Tuesday, February 22, 2011

మాటాడుకుందాం రా...

మాటాడుకుందాం

రా

మనసువిప్పి నగ్నంగా...


కనులలోయలో దాగిన

కలలన్నీ కుప్పబోసి

పూచిక పుల్లాటాడుదామా?

లేక

పాదం అంచున కట్టిన

సైకత ప్రేమమందిరంతో

తాజ్ ని ఓడిద్దామా?


రా నేస్తం..

గుండెపై చెవిపెట్టి

అగ్గిపెట్టెల ఫోన్ ల

దారం గుండా వినబడే

నా లబ్ డబ్ లయను

ఈ కొండ శిఖరాన

నిలబడి లోయంతా

వినపడేట్టు

నీవు ఎలుగెత్తి

గానం చేస్తే

నీతో శృతి కలుపుదామని

ఈ అంచున....


నీ నవ్వుల వెన్నెల

పరచుకున్న

ఈ అడవి పూల

పరిమళం

దిగంతాలు

వ్యాప్తిచెందనీ...


నవ్వు నీ ఒక్కడికే

సొంతమైందన్న

ఈర్ష్య నాలో

పోగొట్టేలా

సందమామ

వంగి నీ నుదుట

ముద్దులిడే

ఆ దృశ్యం

గుండె గూటిలో

పదిలం నేస్తం...


రా

మాటాడుకుందాం...

(ఈ కవిత ఆంగ్లానువాదాన్నిక్కడ చదవొచ్చు.అనువాదకులు శ్రీ జాన్ సత్యానందకుమార్)

Tuesday, February 1, 2011

వెలుగు పూలు




















మీరు నడిచినంత మేరా

వెలుగు పూలు


మీ నవ్వుల కాంతితో

ఈ జగమంతా

వెలుగు పూలు


మీ ఆత్మీయ

కరచాలనంతో

మనసంతా

వెలుగు పూలు


మీరు వదిలిన

జ్నాపకాలన్నీ

మాకు

వెలుగు పూలు

Sunday, September 5, 2010

కాస్తంత ఎండను ఆహ్వానిద్దాం..




ఎప్పుడూ చలువరాతి గదుల్లోనేనా!
కాస్తంతా ఎండను కూడా ఆహ్వానించండి

ఎండ మీ గుండె గదిమూలల్లో
తగిలేలా బార్లా తలుపులు తెరిచి వుంచండి..

గాభరాగా బయటకు వచ్చి
తుఱున మరల లోపలికి ముడుచుకుపోయే
స్ప్రింగ్ డొర్ లను అడ్డుపెట్టి ఆపండి
లేదా బద్దలుకొట్టి బయటపడండి..

ఎండ జీవితంలో సుఖ దుఃఖాలకు సంకేతం..
దాని రూపు తెలీకపోతే
మీతో పాటుగా మీ మెదడు కూడా
నాచు పట్టిపోగలదు..

కాస్తంత ఎండను ఆహ్వానించండి
గట్టిగా నేలను తన్నిపెట్టి
శక్తినంతా పాదాలలోకినెట్టి
పైకెగరండి..
ఆకాశపుటంచులతాకే చేతులకు
అంటిన మబ్బుల చల్లదనం
ఎరుకౌతుంది...

కాస్తంత ఎండను ఆహ్వానించండి
ఎదను హత్తుకున్న మీ
మిత్రుని గుండెలయ మీ
గుండెపొరల ద్వారానే తెలుసుకోండి..
మీలోకి పాకిన తన రక్తచలన
సంగీతాన్ని చెవులారా విని
గొంతులో స్వేచ్చా గీతాన్ని
జుగల్బందీగా గానం చేయండి..

ఎల్లలు చెరిగిన నిర్వాణక్రమాన్ని
అనుభూతిచెందండి..

కాస్తంత ఎండను ఆహ్వానిద్దామా?
Related Posts Plugin for WordPress, Blogger...