Showing posts with label కవిత-విలాపం. Show all posts
Showing posts with label కవిత-విలాపం. Show all posts

Thursday, April 21, 2011

ధరిత్రీ దినోత్సవం



మొన్నో సునామీ
నిన్నో సునామీ
రేపెప్పుడో సునామీ
ముంచెత్తుతున్నా
నీ ఓటమిని నీవే ఖరారు చేసుకుంటున్నావు..
నీ చుట్టూ నీవే పొగబెట్టుకుంటున్నావు..
ఎక్కిన కొమ్మనే నరుక్కునే మూర్ఖత్వం మనది!

నియాంగిరీ పర్వత శ్రేణులనుండి
పాడేరు భూగర్భం వరకు
తవ్విపోస్తున్న బాక్సైటు నిల్వలు..

నర్మదా నుండి పోలవరం వరకు కడుతున్న
ఆనకట్టల గర్భంలో కలిసిపోతున్న నేల...

కోస్తా కారిడార్ పేరుతో విస్తరిస్తున్న
అణు, బొగ్గు కుంపట్ల నిర్మాణం...

నిన్నూ నన్నూ రేపటి తరాన్ని
పాతరేస్తాయని తెలిసినా
మూగగా తలలూపే నీ నా నిస్సహాయత
ప్రకృతి ముందు దోషిగా నిలబెడ్తున్నాయి!

నీ కాంక్రీటు అరణ్యవిస్తీర్ణంతో
అంతరించి పోతున్న పచ్చదనం
మన చివరి శ్వాశకు సంకేతం!

రండి తలా ఒక చేయి వేసి
ధరిత్రీ మాతను కాపాడుదాం...
(ఏప్రిల్ 22 ధరిత్రీ దినోత్సవం)

Friday, August 20, 2010

అమ్మ ఒడిలో..



అమ్మ ఒడిలో
తల వాల్చితే
కళ్ళనుండి ధారాపాతంగా
కారిన కన్నీటితో
సేద దీరిన మనసుతో
ఒక్కసారిగా ఏదో విద్యుత్ప్రవాహ తాకిడితో
మళ్ళీ ఉమ్మనీరులో ఈదినట్లుగా
మరో జన్మెత్తినట్లుగా
శిశువువలె
కేరింతలాడుతూన్నట్లు
అనుభూతి కలిగిన క్షణం
ఓ మహా యుద్ధ విజయానంతరం
వీరుని పెదవిపై ధరహాస చంద్రిక మెరిసిన క్షణం
కోల్పోయినదేదో గురుతెరిగిన మరుక్షణం
అమ్మ పాదాల చెంత
నా శిరశాభివందనం..

Tuesday, June 29, 2010

ఖాళీ ఆవరణ



ఇప్పుడిక్కడంతా ఆవరించుకుంటున్న
ఖాళీ గురించే ఆలోచన..
గుండె గదినుండి అంతా పోగొట్టుకున్నట్టు
చివరాఖరి బొట్టు వరకు పీల్చి వేయబడ్డట్టు
ఏదో మాయో మత్తో కమ్ముకున్నట్లుగా
అంతా ఖాళీ అయిన ఆవరణ..

దేనిచేత పూరింపబడని ఒక లెక్క తప్పిదమా?
కాదేమో!
ఎందుకో అంతా జబ్బపట్టి లాక్కుపోతున్నట్టు...
నాకున్న ఈ రెండుపాదాల కింది నేల
వ్రయ్యలయినట్టు!

ఓ గబ్బిలం నా కనులముందు తన
రెక్కలతో విసురుతున్నట్టు!

కోల్పోయిన సందడి ఎవరిస్తారు మిత్రమా?
అడిగే హక్కు నాకున్నా
మొఖం చాటేసి పోతున్న నీ వెంబడి
ఈ నాలుక్కాళ్ళ పరుగులో నిన్ను
చేరలేనితనం...

దహించివేస్తున్న అగ్నకీలల బారినుండి
ఏ ఫైరింజన్ కాపాడగలదు?

పోనీ పోనీ అంటూ నిస్సహాయ
రాగాలాపన చేయలేని మొండితనం
ఎన్నాళ్ళు నిలబెట్టగలదు...

(అసంపూర్ణం)..

Tuesday, December 22, 2009

మునిముని.... మనమడా


శతాబ్ధాలుగా ఈ నేలలో వేళ్ళూనికుని వున్న
నాపై కరకు ఱంపాలతో నిర్దయగా కోస్తూ
నన్ను నా తల్లి గర్భంలోంచి పెకిలించి
నువ్వు పాదుకున్నదేమిటి బిడ్డా?

నీ మునుపటి తరమేదో నీ కన్నులలో మసకబారి పోయిన
మీ తరానికి శాపమౌతున్న నా మరణ వాంగ్మూలమిది బిడ్డా...

కానీ ఈ నేల నాలుగు చెరగులా పరచుకున్న
నా చిగురు కనుల చూపు మేరా
నా జ్నాపకాలు పరుచుకున్నాయి...

చరిత్ర పుటల మధ్య నలిగిన జీవన చిత్రాలను
నా ఎదలోలోపల పొరల్లో దాచుకున్నాను...

ఎన్నెన్నో సంతోషకర ఘటనల
సమాహారం నా బెరడుచుట్టూ పొదువుకున్నాను....

ప్రకృతి మాత పురిటినొప్పులను
నా వేళ్ళ చుట్టూ భరిస్తూ వచ్చాను...

ఎన్నెన్నో రథచక్రాల పదఘట్టనలను
కనుల ఈనెల మాటున కథ చిత్రాలుగా పాదుకున్నాను...

నీ యంత్ర భూతముల కోరలతో నన్ను
పెకలించి నా చావును ఆహ్వానించిన
నీ తరం భవిష్యత్ ఏమిటోనన్నదే నా బెంగ
ముని ముని మనమడా...

Related Posts Plugin for WordPress, Blogger...