Showing posts with label స్పందన. Show all posts
Showing posts with label స్పందన. Show all posts

Thursday, September 11, 2014

గాల్లో తేలినట్టుంది...


నాకు ఈరోజు ఓ గొప్ప అవార్డు దక్కింది. ఎన్నాళ్ళుగానో ఎందుకురా పుస్తకమేసావు అని రోజూ బాధపడుతూ వుండేవాడిని. ఈ మూల వుండి పుస్తకం అచ్చేసుకుని వేసిన వాటిలో ఓ నూట ఏభై కాపీలు పైగా పంచుకొని మిగిలినవి అటకమీద పడేసి వాటిని చూస్తూ ఇంక పుస్తకాలు వేసుకోకూడదు అనుకుంటు మొన్న ఒకసారి మోహన్ రిషి పోస్ట్ చూసి రాసుకున్న ఈ చిరునామాకు పంపించా. దేవులపల్లి క్రిష్ణమూర్తి గారితో ఈ పరిచయమే తప్ప తనతో ముఖాముఖీ మాట కూడా లేకపోయినా అంత సీనియర్ కథకులు నవలాకారులు అయి వుండి ఇన్ని ప్రేమ వాక్యాలు నాకోసం రాస్తూ నా పుస్తక ముఖచిత్రాన్ని కూడా కార్దు పై వేసి తమ ఆత్మీయతను ఇలా పంపినందుకు ఈ రోజు గాల్లో తేలినట్టు వుంది.
ఆయన వాక్యాలివిః
ప్రియమైన కెక్యూబ్ వర్మగారికి నమస్కరిస్తూ..
పార్వతీపురం నుండి ఈ రోజే దిగింరో 'రెప్పల వంతెన'
వెంటనే దానిపై నుండి మీ లోకాన్ని వీక్షించాను.
ఎంత అందమైన కవిత్వం. చాలా కాలానికో మంచి కవితా సంకలనాన్ని ఆసాంతం చదువగలిగాను.
ఈ మధ్య కాలంలో చదువాలంటె ఒక బంగిన ముందుకు సాగనివ్వటం లేదు. ఈ కవిత్వం అట్లాంటిది మొదలుపెట్టి చివరిదాకా చదివించింది మీ రెప్పల వంతెన. ముఖ్యంగా 'వాన' లో ప్రతి మూడు పాదాలు ఓ రేఖా చిత్రంగా కన్పించినయి.
కాసేపు నిశ్శబ్దాన్ని పాటిద్దాం
అడవి అంతా వెన్నెల పరచుకొంటొంది
కాసింత దోసిలి పట్టండి
ఎవరో నిశ్శబ్ద గీతాన్ని ఆలపిస్తున్నారు
గుండె గది తాళం చెవి తీయండి.
కాసింత విశ్రమించనివ్వండి
కనుల ముందు కదలాడుతున్న
రక్తసిక్త గాయాల నుండి
కనుల లోయలో కరిగి పోని కలల నుండి
కాసిన్ని కలవరింతలనేరుకొని కలబోసుకోవడానికి
ఎంత మంచి భావన. బాగుంది
స్థూపం మీది పేర్లు-
ఇవి పేర్లు మాత్రమేనా, వెయ్యేళ్ళ యుద్ధనావను నడిపిన సరంగుల ఆనవాళ్ళు
రేపటి సూర్యోదయానికి అరుణిమను పూసింది.
ఎంత బాగుంది. చక్కటి భావన
ఈ రెప్పల వంతెన అంచున నిలబడి ఒక్కో దారప్పోగును పేనుతూ, అక్షరాల అల్లికలల్లుతూ మీరు వ్రాసిన ఈ కవిత్వం నన్నెంతో కదిలించింది. మీరు సన్నని తీగలను నిశ్శబ్ధంగా మీటుతూ రక్తజ్వలన సంగీతాన్ని ఆలపించిన గీతాలను విన్నాను.
గోడ ఎక్కడో ఒరిగిపోయిన వీరిని చివరి పిలుపు
గోడలన్నీ నినాదాల గేయాలు
గోడ యుద్ధ నగారా
గోడ ఆత్మీయ చిత్రంగా ఆలింగనం చేసుకొని చేదతీర్చే రావి చెట్టు.
ఎంత మంచి భావన.
నెలవంక వెనకాల నడకలో మీ గూర్చి తెలుసుకున్నాను. ఆనందించాను. అట్,ఏ అలికిడిలేనితనం---
అఫ్సర్ ముందు మాట బాగుంది,
ఎంతో ప్రేమతో పంపించినందులకు కృతజ్ఞతలు---
ఏకబిగిన పుస్తకమంతా చదివాను.
కనురెప్పల వంతెన కింద నల్ల రేఖనై కరిగి పోయా
నెలవంక వెనకాల నడకనయ్యా.
జయహో---
మీ
దేవులపల్లి కృష్ణమూర్తి
07-09-2014.
ఇంతకంటే కవిత్వం నుండి ఏమాశించగలను. ఆ పెద్దాయన ఇన్ని వెన్నెల మాటలను కుప్పగా బోసి ఇస్తే రెండు చేతులూ జోడించి నమస్కరించగలను తప్ప..

Tuesday, October 29, 2013

ఋతువు....

అప్పుడే శీత గాలి వీస్తోంది
పావురాయి గూట్లో కుర్ కుర్ మని కలియదిరుగుతూ

ఒక్కో ఆకూ నేలదారి పడుతూ
తురాయి కాయలు వంకీలుగా కత్తిలా వేలాడుతూ

చర్మం మొద్దుబారుతూ పెళుసు బారుతూ
క్రీముల అడ్వర్టైజమెంట్ల గోల మొదలవుతూ

రగ్గులన్నీ దులుపుతూ ఆవిడ మళ్ళీ ఒకసారి
అలమరా అరలు సర్దుకుంటూ

తలుపులేని ఇంటికి తడికయినా లేక
ఆ ముసలి అవ్వ అలా నులకమంచంలో గొణుగుతు

ఋతువేదైనా జీవితం నిండుగా ఇన్ని మడతల
మద్య చినిగిన దుప్పటిలో గాలి చొరబడుతూ వెక్కిరిస్తూంది కదా!!

Thursday, March 25, 2010

అరచేతులలో నేను



నిన్ను చూస్తుంటె మా అమ్మ చేతిలో
నేనాడిన మధుర క్షణాలు గుర్తుకొస్తున్నాయి కన్నా

నవమాసాలు మోసి నీవు పేగు తెంచుకొని
బయటపడ్డప్పటి బాధ
నీ నవ్వుతో మటుమాయమయ్యిందిరా..

యింక నీ ఎదిగే ప్రతిక్షణమూ
తప్ప నాదంటు ఏమీ లేనిదానను..

(విజయవాడ సాహితీ మిత్రులు కవితా మార్చి 2010 సంచికలోని T.Srinivasa Reddy గారి ఫోటో చూసి)

Monday, March 22, 2010

మరో మారు సిద్దార్థుడి హత్య

తాను రాజభవనం వీడి రాలేదు..
దుఃఖం ఎరుగక ఇల్లు వదలలేదు
అన్నార్తులు, అభాగ్యులు, విధివంచితులు,
పీడితులు, తాడితులు,
తనకు సుపరిచితులే..

తన చుట్టూ వున్న వాతావరణం
నిలబడనీయక,
కాలికింద మట్టి పెల్లగింపబట్టి
తన పయనాన్ని వేగవంతం చేయగా
జనం తలలో నాలుకలా
పొద్దుగుంకని, బడలికలేని తనంతో
నలుదిక్కులా సాగిందీ సూరీడి పయనం..

సామాజిక రుగ్మతల కార్యకారణ సంబంధాల
నిజరూపాన్ని అనేక బోధి వృక్షాల కింద
అధ్యయనం చేసి ఔపోసన పట్టి
నయా బుద్ధుడయ్యాడు!

నాటి సిద్దార్థుడు కత్తిని విడిచి
శిరోముండనం చేసుకొని విరాగికాగా
నేటి సిద్దార్థుడు చేత మరతుపాకీ పట్టి
పచ్చని చొక్కాలో పంటచేలమధ్య కలుపును
పెరికే పనిలో పడ్డాడు!

దుఃఖానికి మూలం కోరికలే కాదు
అపరిమిత స్వార్థంకూడా తోడయిన నాడు
ప్రవచనాల వల్లింపుతో ఏదీ సాధ్యపడదన్న
జ్ఞానోదయమై శత్రువు పక్కలో బల్లెమైనాడు

కుళ్ళి కృశించి నశించే కంటే
ఉల్కలా మారి బూడిదకావాలని ఆశించిన వాడు
నేలతల్లి విముక్తి పోరులో
మరోమారు సిద్ధార్థుడు హత్యకావింపబడ్డాడు..

(సురాజ్యాంగం ఉన్నా సుజనుల హత్యలు అన్న కన్నాభిరాన్ వ్యాసం (తే.21.3.10దీ ఆంధ్రజ్యోతి)చదివి..)
Related Posts Plugin for WordPress, Blogger...