
ఒలి ఒలొలి రంగె ఓలీ
సమ కేలిల ఓలి...
అందరం కాసేపైనా రంగులనద్దుకొని
మన అసలు రంగులను దాచేద్దాం..
వాన వెలిసినాక అదెలాగు బయటపడక మానదు
తీసుకో పిడికెడు రంగు
ఒత్తుకో నీ ముఖానికింతా
నా ముఖానికింతా..
ఒలీ ఒలోలి రంగె ఓలీ
సమకేలిల ఓలి..
మేమున్నది యుద్ధరంగంలోనే
జరిగేది, జరగబోయేది యుద్ధమేనని తెలుసు
కొత్తగా మీ ఘీంకారాలకు వెరచి వెన్ను చూపేది లేదు
ఆయుధం మీకు జీతాన్నిస్తుంది..
ఆయుధం మా శరీరాంతర్భాగమయ్యింది
ఇది స్పార్టకస్ తో మొదలై కొనసాగుతూన్న కలల పోరాటం..
సత్యం కోసం జరిగే అలుపెరుగని ఆరాటమిది
కోట్లాది ఆక్రందనల, అవేదనల, ఆర్తనాదాలకు ముగింపు కొరకు
నేలతల్లి విముక్తికొరకు సాగుతున్న సాయుధ కవాతు యిది
ఓటమి నెదుర్కొనడం మాకు కొత్త కాదు
శతాబ్ధాల మహాప్రస్థానమిది
జీవితమే యుద్ధమైనపుడు
యుద్ధాన్ని ఓడించడానికే యుద్ధం చేస్తున్న వాళ్ళం…









వాడికొకటే ధ్యాస
కౄరత్వంలో కొత్త పద్ధతులెలా కనిపెట్టలని
నా తపన వేరు
అత్యాచారాలనెలా అంతమొందించాలని
నరకం అంటే కోపమెందుకు?
ఆకాశాన్ని నిందించడం దేనికి?
లోకమంతా అన్యాయం నిండివుంటే
రా! ఎదుర్కొని పోరాడుదాం!
నేను కొద్ది క్షణాల అతిథిని
పొద్దు పొడుపుని సూచించే వేగుచుక్కని
ఆరిపోవడం అంటే భలే ఇష్టం నాకు
నా చుట్టూ గాలిలో
చైతన్యపు విద్యుత్తు ప్రవహిస్తోంది
పిడికెడు బుగ్గి క్షణికమయినది
ఉంటే ఎంత? లేకుంటే ఎంత?
సుఖంగా వుండు తమ్ముడూ!
సాగిపోతున్నా పయనమై
ధైర్యంగా వుండు… నమస్తే!
నీ సోదరుడు,
భగత్ సింగ్
సెంట్రల్ జైలు, లాహోర్,
(మార్చి3, 1931)
( జైలునుంచి చిన్న తమ్ముడు కులతార్ సింగ్ కి రాసిన ఆఖరి ఉత్తరం)
(సెప్టెంబరు ౨౮న భగత్ సింగ్ జన్మదినం)
(సేకరణ: నా నెత్తురు వృధాకాదు, భగత్ సింగ్ రచనలు - జనసాహితి ప్రచురణలు)