
ఎనిమిదో చేపను నేనే అయి
ఏడో చేప మొప్పలపై ప్రేమగా నిమిరి
తన చెవిలో గుసగుసలాడాను..
చేపా నిన్ను యీ ఒడ్డుకు చేర్చినదేమిటమ్మా అని!
మా మనసులలో దాగిన కల్మషమా!
లేక మేము విడుస్తున్న కాలుష్యమా? అని
నీ గొంతు మూగబోయి
నీ ఒడలు కాంతి విహీనమయి
నీ పై పొరలుగా ఏర్పడ్డ ఈ నల్లని
నూనె చారికలు దేని గురుతులు?
పాల నురుగులాంటి సముద్రుడు
నేడు యిలా ఉగ్రరూపుడై సునామీ అవతారుడై
కన్నెర్ర చేస్తున్న సూచికను తెలిపేందుకా?
నీ ఎర్రని బోసినోరు యిలా నెత్తురోడుతున్నదేమి?
నీ ప్రేయసిని చెరబట్టి అమ్మిన మా పాపాన్ని కడిగేందుకా?
క్షమించు తల్లీ యిక్కడ ప్రేమ, కరుణ, ఆప్యాయతలు
అమ్మకపు సరుకయినాయి...
నాయీ వేడుకోలును దయతో మన్నించుతల్లీ...
రాబోకు యిలా యీ రాచకార్యాల
రణరంగం మద్యకు...