Showing posts with label స్మరణ. Show all posts
Showing posts with label స్మరణ. Show all posts

Sunday, June 5, 2016

నివురు..

కొన్ని సాయంత్రాలకు నల్లని ఆకాశపు కొక్కేనికి
ఒంటరి వెన్నెల ఉరిపోసుకుంటుంది

అలముకొన్న సదురు నుండి ఆత్మ
వేరుపడక పొక్కిలిగా పిగిలి పోయింది

నెత్తుటి ధారలన్నీ సిరాగా మారి
చరిత్రను పేజీలలో మడతపెట్టాయి

యింత నమ్మకాన్ని పంచిన
ఉదయాలేవీ నీ కనుపాపలు చేరలేదు

ఈ ఇప్ప పూల వనం రాలిపోతూ
నిబ్బరాన్ని వదిలి నివురు కప్పుకుంది

తూరుపింకా తెలవారక నీ పేరు
తలుస్తూ పొలమారుతొంది

కోందు బాలుడొకడు గొడ్డలి నూరుతూ
నియాంగిరీ సానువులలో సాగిపోతున్నాడు

(కామ్రేడ్ సత్నాం స్మృతిలో)

కానుగపూల పరిమళం...


కొన్ని సాయంత్రాలు దేహం కోల్పోయిన
ఆత్మను మోసుకొస్తుంది


అడుగుల పరిధి కుంచించుకొని
ఒక మాత్ర అందని దూరంలో విసిరేయబడతావు

పహరా చుట్టూ కంచె పెరుగుతూ
నడకను నియంత్రిస్తుంది

నీలోని ప్రతి అణువును మలేరియా తిని
మెదడుకు పాకి కళ్ళను పైకెగదోస్తుంది

నిట్ట నిలువుగా వెన్నును విరిచి
కాళ్ళను చేతులను హరిస్తుంది

నీ నుదుటి మీద వెన్నెల ఓ
దు:ఖపు ముద్దుగా మెరిసి కుంగిపోతుంది

నువ్వంటావు చివరిగా ఈ ఝెండా
భుజం మార్చుకుంటుందా అని

రవీ నువ్ నడిచినంత మేరా పరచుకున్న
ఈ కానుగ పూల పరిమళం అద్దుకుని

అటు చివర ఆ బాలుడు విల్లునలా
గురిచూస్తూ విసురుగా వస్తున్నాడు...

(మలేరియా కబళించిన కామ్రేడ్ సి.సి.కమాండర్ రవి స్మృతిలో)

Sunday, October 11, 2009

కరిగిన స్వప్నం

నివ్వెరపోయాను
నిశ్చేష్టుడనయ్యాను
ఇంతటి సున్నిత మనస్కున్ని కోల్పోవడ౦
పాడులోకపు ప్రారబ్ధ౦

నిన్న మొన్నటి వరకు మన౦ కలిసి
జరిపిన సభలు - సమావేశాలు
ప౦చుకున్న జ్ఞాపకాలూ - తీపిగురుతులు
వేదనలు, మానసిక సంఘర్షణలు
ఇప్పటికి కనులముందు కదలాడుతున్నాయి

ప్రతిసారీ నీవు చెప్పిన గు౦డెలి౦కినతన
నిన్ను ఇలా మి౦గేస్తు౦దని ఊహి౦చలేకపోయాను

మేము ఒరిగిన ప్రతిసారీ ఆసరాగా నిలిచి
వెన్నుచరిచి ము౦దుకు తీసుకుపోయిన
నీ ధైర్యాన్ని మి౦గిన రాహువేదో
తెలియక మూగగా రోదిస్తున్నాను

నీ నవ్వుల వరికంకులు లేని
శరత్కాలపు వెన్నెల
మసక బారిపోయి
నాగావళి ఇసుకలో ముఖ౦ దాచుకు౦ది

రాబోయే యుద్ధ కాలానికి
నీ పదునెక్కిన కల౦తో
మమ్మల్ని కవాతు చేయిస్తావని కన్నకలల్ని
ఇలా జ్ఞాపకాల కన్నీటి వరద మద్య
చుక్కాని లేని నావలో
ఒంటరిగా చేసి పోవడం
భావ్యమా?

(నిరసనగానో నిస్సహాయతతోనో తన ఒ౦టరి పోరాటాన్ని ఆత్మహత్యతో ముగించిన నా సాహితి మిత్రుడు పడాల జోగారావు గారి జ్ఞాపకాలతో)
Related Posts Plugin for WordPress, Blogger...