
Wednesday, May 30, 2012
Monday, May 28, 2012
Sunday, May 27, 2012
వేసవితనం...
Friday, May 25, 2012
వెన్నెల పయనం
కలలనన్నీ మోసుకుంటూ
జ్ఞాపకాల వెంట అడుగులేస్తూ
గుండెల్లో అగ్ని పర్వతాన్ని రాజేస్తూ
వెన్నెలనింత దోసిట పట్టి
ఉదయిస్తున్న సూరీణ్ణి ఆహ్వానిస్తూ
పచ్చదనాన్ని నేలంతా పరుచుకుంటూ
సాగుతున్న
ఈ
అలుపెరుగని ప్రయాణం
ఊరి చివర
ఖండితుని శిరస్సులో
నవ్వునద్దేంత దాకా...
Wednesday, May 23, 2012
ఎప్పుడైనా నిన్ను నువ్వు...
ఎప్పుడైనా నిన్ను నువ్వు
వడిసెల రాయిని చేసి
విసిరి చూసావా??
ఎప్పుడైనా నిన్ను నువ్వు
కాగితప్పడవను చేసి
వాన నీటిలో ఈది చూసావా??
ఎప్పుడైనా నిన్ను నువ్వు
కాగితపు రాకెట్ గా చేసి
విసిరి చూసావా??
ఎప్పుడైనా నిన్ను నువ్వు
గాలిపటానికి తోకగా మార్చి
దారపు చివరంటా ఎగిరి చూసావా??
ఎప్పుడైనా నిన్ను నువ్వు
గులకరాయిని చేసి
నీటిలో కప్పగంతులేసి చూసావా??
ఎప్పుడైనా నిన్ను నువ్వు
రంగునీళ్ళగా మార్చి
హోళీ ఆడి చూసావా??
ఎప్పుడైనా నిన్ను నువ్వు
సీతాకోక చిలుక రెక్కపై
రంగు పొడిలా అంటుకొని చూసావా??
ఎప్పుడైనా నిన్ను నువ్వు
రిబ్బను ముక్కగా మార్చి
జడకుచ్చుగా చూసుకున్నావా??
ఎప్పుడైనా నిన్ను నువ్వు
వరికంకుగా చేసి
పిచ్చుక నోటికందించి చూసావా??
ఎప్పుడైనా నిన్ను నువ్వు
నాగలి కర్రుగా మార్చి
మట్టిగుండెలో్ చాళ్ళుగా మారి చూసావా??
ఎప్పుడైనా నిన్ను నువ్వు
సమ్మెటగా మార్చి
ఎర్రగా కాలిన ఇనుప కమ్మిపై పడి చూసావా??
ఎప్పుడైనా నిన్ను నువ్వు
డప్పుపై చర్మంగా మార్చి
నకజనకరి నాం దరువై చూసావా??
ఎప్పుడైనా నిన్ను నువ్వు
కాలి గజ్జెలో మువ్వగా మార్చి
థింసా పాదం ఆడి చూసావా??
ఎప్పుడైనా నిన్ను నువ్వు
ఓ తూటాగా మార్చి
వాడి గుండెల్లో దూసుకుపోయి చూసావా??
వడిసెల రాయిని చేసి
విసిరి చూసావా??
ఎప్పుడైనా నిన్ను నువ్వు
కాగితప్పడవను చేసి
వాన నీటిలో ఈది చూసావా??
ఎప్పుడైనా నిన్ను నువ్వు
కాగితపు రాకెట్ గా చేసి
విసిరి చూసావా??
ఎప్పుడైనా నిన్ను నువ్వు
గాలిపటానికి తోకగా మార్చి
దారపు చివరంటా ఎగిరి చూసావా??
ఎప్పుడైనా నిన్ను నువ్వు
గులకరాయిని చేసి
నీటిలో కప్పగంతులేసి చూసావా??
ఎప్పుడైనా నిన్ను నువ్వు
రంగునీళ్ళగా మార్చి
హోళీ ఆడి చూసావా??
ఎప్పుడైనా నిన్ను నువ్వు
సీతాకోక చిలుక రెక్కపై
రంగు పొడిలా అంటుకొని చూసావా??
ఎప్పుడైనా నిన్ను నువ్వు
రిబ్బను ముక్కగా మార్చి
జడకుచ్చుగా చూసుకున్నావా??
ఎప్పుడైనా నిన్ను నువ్వు
వరికంకుగా చేసి
పిచ్చుక నోటికందించి చూసావా??
ఎప్పుడైనా నిన్ను నువ్వు
నాగలి కర్రుగా మార్చి
మట్టిగుండెలో్ చాళ్ళుగా మారి చూసావా??
ఎప్పుడైనా నిన్ను నువ్వు
సమ్మెటగా మార్చి
ఎర్రగా కాలిన ఇనుప కమ్మిపై పడి చూసావా??
ఎప్పుడైనా నిన్ను నువ్వు
డప్పుపై చర్మంగా మార్చి
నకజనకరి నాం దరువై చూసావా??
ఎప్పుడైనా నిన్ను నువ్వు
కాలి గజ్జెలో మువ్వగా మార్చి
థింసా పాదం ఆడి చూసావా??
ఎప్పుడైనా నిన్ను నువ్వు
ఓ తూటాగా మార్చి
వాడి గుండెల్లో దూసుకుపోయి చూసావా??
Monday, May 21, 2012
కాసేపాగి వస్తాను..

ఆగండి కాసేపాగి వస్తాను..
చేతికంటిన ఈ రంగును
ఇక్కడ ఈ నలుపు తెలుపుల
బొమ్మకు యింత రంగునద్ది
వస్తాను..
ఎన్నాళ్ళుగానో యిలా
పాలిపోయినట్టు కాంతి విహీనమైన
ఈ బొమ్మకు ఈ రంగుపూసి
వెలుగులోకి తెద్దామని
ఇలా ఆగి వస్తా...
ఎవరో అసంపూర్ణంగా వదిలేసిన
రేఖా చిత్రంలా
ఆ కను రెప్పలకావల ఏదో
ఆశ నిరాశల వలయాలు
కాటుక రేఖలా అద్దీ అద్దనట్టు
సగం చెరిగి దోబూచులాడుతూ
గుండె లోలోతుల్లో సుళ్ళు
తిరుగుతున్నాయి...
ఆ నుదుటిపై
పొద్దు గుంకిన సూరీడు ఆనవాలుగా
చెరిగిన తిలకంలా రేఖామాత్రపు
గాయమో కాలమో వెక్కిరిస్తూ
ఎదలో ముల్లులా గుచ్చుతూ...
వాన వెలిసిన రాతిరి
నిర్మలంగా వెలుగుతున్న ఆకాశంలా
ప్రతిఫలిస్తున్న తేజస్సు ఏదో
ఆ చిత్రంలో వెంటాడుతూ
నా రంగులంటిన చేతిని
శుభ్రపరుస్తూ....
Friday, May 18, 2012
నేనిలా...

నిశ్శబ్ధం
ఒంటరిగా
కాలుతున్న వాసన...
చెవిలో ఏదో సైలెన్సర్ బిగించినట్టుగా
ఏదీ వినబడనితనం
ఒక్కోమారు బిగుతుగా...
కంట్లో రెటీనాపై నల్లగా ఓ తెర కప్పి
లోలోపల ఏవో శూన్య రేఖలు
బర బరా గీస్తున్నట్టు...
దేనికదే వేటికవే
ఓ నిశ్శబ్ధ యంత్రం చుట్టూ
మూగి గుస గుసలాడుతున్నట్టు...
దేహమంతా ఓ గుండ్రని
బంతిలా మారి దొర్లుకుంటూ
ఓ మూలన చేరినట్టు...,
గాలి వీయని తనంతో
అంతా మూగగా ఉగ్గబట్టి
రోదిస్తున్న వేసవితనం ముసురుపట్టినట్టు...
సెలయేళ్ళన్నీ బయలు దేరిన చోటనే
లోలోపలికి యింకుతూ
రాతి మూలల దాగినట్టు...
అలలన్నీ బంద్ చేసి
ఒడ్డుకందని దూరంతో
సముద్ర గర్భంలో నిదుర పోయినట్టు...
ఆకురాలిన కాలంలో
గొంతు మూగబోయిన
కోయిలలా పాటరానితనంతో
నేనిలా...
ఒంటరిగా
కాలుతున్న వాసన...
చెవిలో ఏదో సైలెన్సర్ బిగించినట్టుగా
ఏదీ వినబడనితనం
ఒక్కోమారు బిగుతుగా...
కంట్లో రెటీనాపై నల్లగా ఓ తెర కప్పి
లోలోపల ఏవో శూన్య రేఖలు
బర బరా గీస్తున్నట్టు...
దేనికదే వేటికవే
ఓ నిశ్శబ్ధ యంత్రం చుట్టూ
మూగి గుస గుసలాడుతున్నట్టు...
దేహమంతా ఓ గుండ్రని
బంతిలా మారి దొర్లుకుంటూ
ఓ మూలన చేరినట్టు...,
గాలి వీయని తనంతో
అంతా మూగగా ఉగ్గబట్టి
రోదిస్తున్న వేసవితనం ముసురుపట్టినట్టు...
సెలయేళ్ళన్నీ బయలు దేరిన చోటనే
లోలోపలికి యింకుతూ
రాతి మూలల దాగినట్టు...
అలలన్నీ బంద్ చేసి
ఒడ్డుకందని దూరంతో
సముద్ర గర్భంలో నిదుర పోయినట్టు...
ఆకురాలిన కాలంలో
గొంతు మూగబోయిన
కోయిలలా పాటరానితనంతో
నేనిలా...
Tuesday, May 15, 2012
ఆహ్వానిద్దాం....

ఆహ్వానిద్దాం
దేహద్వారాలన్నీ తెరిచి
ఎండనూ వాననూ చలిని
తడి పొడిల సంగమాన్నీ
అన్నింటినీ
ఆహ్వానిద్దాం....
అవును
ఆహ్వానిద్దాం...
తలుపులు బార్లా తెరిచి
గుండె గది మూలలన్నీ తెరచి
అగరు బత్తీ పరిమళాన్ని
సన్నజాజుల వాసననీ
మల్లె పూల గుబాళింపునీ
గులాబీ రేకుల మృధుత్వాన్నీ
మొగలి రేకుల సువాసననీ
ఆహ్వానిద్దాం...
ఇప్పుడు
ఆహ్వానిద్దాం...
కనుల వాకిట మూయని
కన్రెప్పల తలుపులు తెరిచి
నలుపు తెలుపుల సంగమాన్ని
ఏడేడు వర్ణాల మిశ్రమ ఇంద్రధనస్సునీ
ప్రతిఫలిస్తున్న సమస్త వర్ణాల
ప్రతిబింబాన్ని లోలోపల
గోడలన్నీ అలికి ముగ్గు వేస్తూ
ఆహ్వానిద్దాం....
తప్పనిసరిగా
ఆహ్వానిద్దాం....
తెల్ల బడుతున్న మీసాన్ని
ఎండబడుతున్న చర్మాన్ని
పరుగులెత్తిన కాల చక్రానికి పడ్డ
అడ్డంకుల ముళ్ళనీ
కనుగుడ్లపై అలుకుతున్న తెల్లపొరనీ
గుండె కవాటానికి పడుతున్న చిల్లునీ
నవరంధ్రాల గుండా లోనకు
లోలోనకు పొగచూరుతున్న కాలాన్ని
ఆనందంగానే ఆహ్వానిద్దాం...
రండి
ఈ మలుపులో
కాసింత విశ్రమించి
ఊపిరి పీల్చుకునే సాయం సంధ్యవేళ
ఆమె చేతిలో చేయి వేసి
కాసేపు ఇక్కడ
చిగురించిన ఈ చింత చిగురు
లేతదనాన్ని ఆమె వేలి చివర
స్పృశిస్తూ
అరి పాదాల గుండా పాకుతున్న
పచ్చిక మెత్తదనాన్ని
ఆస్వాదిస్తూ
ఆహ్వానిద్దాం...
రా నేస్తం...
ఎత్తిపట్టిన కత్తితో మృత్యువుతో
పెదవి చివరంటా తొణకని
చిర్నవ్వుతో యుద్ధం చేద్దాం...
Sunday, May 13, 2012
పొడుస్తున్న పొద్దులో..

ఒక్కోసారి అంతే..
తను పెరిగి పెద్దవాడైనా
తన వెనకే నడవాలని
తన నీడనే వుండాలని
కోరుకుంటుంది మనసు...
కానీ
నా లాంటి
అమ్మలనెందరికో
పుత్ర వాత్సల్యాన్ని తీర్చే
కొడుకుగా నడుస్తూ
వెళతావని ఊహించలేదు...
నాకు నీ రాజకీయ ప్రకటన
అర్థం కాలే..
కానీ అర్థాకలితో నిదరోయే
ఎన్నో కాలిన పేగుల వాసన
దానిలో కనబడి
నిన్ను తలచిన ప్రతిసారీ
నా పేగు కదిలింది...
ముంగిట వున్న
మామిడి చిగురువేసి
పూత వచ్చి పిందెలన్నీ
పండ్లుగా మారిన ప్రతిసారీ
గుర్తుకొస్తూనే వుంటావురా...
పొలం గట్లపై
లేడి పిల్లలా దుంకుతూ
తల్లి ఆవు వెనక
పరుగుపెట్టే లేగ దూడ
లేత గిట్టల్ని చూసినప్పుడంతా
యాదికొస్తావురా...
తొలకరి చినుకు పడి
మట్టి పురిటి వాసన
వేసిన ప్రతిసారీ
నీ తొలి పిలుపు
మెదిలి కన్న
పేగు మెలిపెడ్తుందిరా..
నీవు చెప్పే మాటలన్నీ
పాడే పాటలన్నీ
వినబడీ చనుబాలధార
కడుతుంటే
కన్నీళ్ళింకినది గుండెల్లోకాదని
తెరిపినిస్తుంది...
ఒక్కొక్కరు ఒక్కో మాటాడుతూ
తూట్లు పొడవాలని చూస్తుంటే
నీ గుండెనిబ్బరం చూసి
అమ్మనైనందుకు
గర్వంగా వుంటుంది...
నీవలాగే
నిరంతరమూ ఎక్కుపెట్టిన
విల్లులా నిలిచి
పోరుసల్పాలని
ఆశపడుతూ
పొడుస్తున్న
పొద్దులో వెతుకుతు...
Wednesday, May 9, 2012
దిగంతాలకావల...

దిగంతాల చివరాఖరు అంచుపై
నువ్వూ నేనూ..
ఏ మాలిన్యమూ అంటని
ఏ కాలుష్యమూ సోకని
ఏ కాఠిన్యమూ తాకని
నవ్వుల కాంతులు పూయిస్తూ..
దేహమంతా సంతోషపు
రెక్కల సవ్వడి వీవెనగా...
మనకు మనమే
రారాజుగా
ఈ ఆకాశపుటెడారిలో
ఆర్థ్ర వర్షపు జల్లులలో
తడుస్తూ
దాహార్తిని తీర్చుకుంటూ....
ఎలుగెత్తి స్వేచ్చా నినాదం
ఆద్యంతాలు పిక్కటిల్లేలా
చేస్తూ...
ఒక్కో అణువూ
దేనికదే విడివడి
దానికదే ఏకమవుతూ
సాగుతున్న
ఈ అనంత పయనంలో
సమూహంలో
ఒంటరి బాటసారిగా....
నువ్వూ నేనూ..
ఏ మాలిన్యమూ అంటని
ఏ కాలుష్యమూ సోకని
ఏ కాఠిన్యమూ తాకని
నవ్వుల కాంతులు పూయిస్తూ..
దేహమంతా సంతోషపు
రెక్కల సవ్వడి వీవెనగా...
మనకు మనమే
రారాజుగా
ఈ ఆకాశపుటెడారిలో
ఆర్థ్ర వర్షపు జల్లులలో
తడుస్తూ
దాహార్తిని తీర్చుకుంటూ....
ఎలుగెత్తి స్వేచ్చా నినాదం
ఆద్యంతాలు పిక్కటిల్లేలా
చేస్తూ...
ఒక్కో అణువూ
దేనికదే విడివడి
దానికదే ఏకమవుతూ
సాగుతున్న
ఈ అనంత పయనంలో
సమూహంలో
ఒంటరి బాటసారిగా....
Monday, May 7, 2012
అభ్యర్థన...

వెతికే నా కంటి చూపు లోతు తెలియనిదా
నీ కనురెప్పల కావల దాగిన
నా మనోచిత్రానికి...
నీ ప్రేమ కోసం ఆర్తిగా వేచివున్నానని
ఆ తపనలో దాగిన నా ఎద లయ
విన్న నీకు తెలియనిదా...
నా మాటలన్నీ నీ మౌనాన్ని
బద్ధలు చేసి నీ గుండె తలుపును
తట్టి నీ దరికి చేరడానికే కదా...
నీవు పలుకని ప్రతి క్షణం
నా దేహమంతా చీకట్లు ముసురుకున్నట్టు
అమవాస వెలితిలో భారంగా
రథచక్రం కుంగిన కర్ణునిలా
కూలబడ్డ నా వంక చూసి
చులకనైనది ఎవరో తెలియదా,,,
సఖీ ప్రియా
కలసిన మనసుల మధ్య
మౌనరాగాల నేపథ్య సంగీతంలో
ఇన్నిన్ని ప్రశ్నల బాణాలతో
గుండెను గాయం చేయాలా??
నా కన్నీటి దోసిలిలో
ఓ వెండి వెన్నెల పూర్ణిమలా
నవ్వుతూ కానరావా...
Saturday, May 5, 2012
Friday, May 4, 2012
Wednesday, May 2, 2012
నాతో ఆమెతో నేను
నాతో ఆమె
ఎందరిలో వున్నా....
నీ సవ్వడే వినిపిస్తుంది!
పనిలో నిమగ్నమైన ....
నీతో మాట్లాడాలనిపిస్తుంది!
ఓపిక లేకున్నా ....
నిన్ను కలవాలనిపిస్తుంది!
ఇంతవరకు నిన్ను చూడకున్నా....
నీకు సన్నిహితంగా మెలగాలనిపిస్తుంది!
అర్థం లేని ప్రశ్నలే అని నీవన్నా....
ఎన్నెన్నో ప్రశ్నలకు జవాబులు నీవేగా తోస్తుంది!
అలసిన వేళ నిద్రపుచ్చాలని....
నిదురోతుంటే తట్టిలేపాలనిపిస్తుంది!
నీతోనే ఇలా సాగిపోవడం తప్పని తెలిసినా....
మనసు ఇలా నన్ను వెంటాడి వేధిస్తూనే ఉంది!
నీవు నాదరి లేకున్నా, నాలోనే ఉన్నట్లు....
ఏదో తెలియని అనుభూతి నన్ను గిలిగింతపెడుతుంది!
ఆమెతో నేను...
మౌనంగా నీ అంతంరంగ చిత్రాన్ని
నలుపు తెలుపుల సమ్మేళణం చేస్తూ
ఇలా నీ ఎదురుగా నిర్నిమేషంగా...
ఇంత హడావిడి జీవన పరుగులోనూ
ఒకింత సేదదీరి ఊపిరి పీల్చుకోవాలనిపించేది
నీ చెంతనే కదా...
ఏదో బతుకు ఓ బండరాయిలా
దొర్లుకుంటూ మీద ఒరిగిపడుతున్న వేళ
నీ నీడ చాటున దాగి రహస్యంగా
ఓ గుక్కెడు నీళ్ళు తాగాలనిపిస్తోంది...
ఇది తప్పు ఇది ఒప్పు అని
కానరాని లక్ష్మణ రేఖ ఏదో
మన మధ్యన భగ్గుమని లేస్తూ ....
నిన్నో ఒడ్డుకు నన్నో తీరానికి
విసిరేయ జూస్తున్నా...
అందని చేతి వేళ్ళను
తాకాలని మదినిండా
తీరని అభిలాష వెంటాడగా...
స్మృతులన్నీ ఏక్ తారగా
ఆలపిస్తున్న యీ నా మౌన గీతం
నీకే అంకితం...
Monday, April 30, 2012
నాకింకా...
నాకింకా అతడి చేయి నా భుజంపై
వున్నట్టే వుంది..
అతడు నేనూ కలసి ఆ దారులు లేని
రాదారిలో నడుస్తున్నట్టే వుంది...
అతడు చురుకైన చిరుత చూపులతో
జింకలా రాళ్ళ గుట్టల్ని సుతారంగా
తొక్కిపెడుతూ యెక్కుతుంటే..
నాకింకా అతడి చేయి నా భుజంపై
వున్నట్టే వుంది..
అతడు ఆప్యాయంగా చేయందిస్తూ
నవ్వుతుంటే ఆకాశంలో చందమామ
అందినట్లే వుండేది..
నాకింకా అతడి చేయి నా భుజంపై
వున్నట్టే వుంది...
అతడు మాటాడుతుంటే తను చేస్తున్న
వ్యవసాయం పట్ల రైతుకు వున్న
నిబద్ధత కలిగిన ప్రేమ వ్యక్తమై
గుండెను తాకేది...
నాకింకా అతడి చేయి నా భుజంపై
వున్నట్టే వుంది...
అతడు అలసటను మరపిస్తూ నన్నగా
స్మృతి గీతమాలపిస్తుంటే
నడకలో దూరం తెలియనితనం...
నాకింకా అతడి చేయి నా భుజంపై
వున్నట్టే వుంది...
అతడు ఓ రహస్య ప్రేమికుడిలానో
స్నేహితుడిలానో కనిపించి
గొప్ప ఓదార్పునిచ్చేవాడు..
నాకింకా అతడి చేయి నా భుజంపై
వున్నట్టే వుంది...
అతడి గుండెల్లో దిగిన తూటా
నవ్వుతూ పిడికిలెత్తిన
ఆ రూపం నీకెన్నటికీ
నిద్రపట్టనీయదు
నా ప్రియ శతృవా...
నాకింకా అతడి చేయి నా భుజంపై
వున్నట్టే వుంది...
(18 ఏళ్ళకే అమరుడైన కా.కిరణ్ స్మృతిలో)
Sunday, April 29, 2012
లాంగ్ మార్చ్
ఇప్పుడంతా నవ్వులే
అలా నవ్వుతూ
తుళ్ళుతూ
ఒకరి భుజంపై బరువు
ఒకరు మార్చుకుంటూ
చెట్టపట్టాలేసుకొని
ఒకరి వెనుక ఒకరు
ఒకరితో ఒకరు
చిన్నగా మాటాడుకుంటూ
ముసి ముసిగా నవ్వుతు
చీకట్లో వెన్నెల పూత పూస్తూ
రాదారులే లేని నేలపై
చీమల బారులా
అలా సాయుధంగా
సాహసంతో
సావాసంగా
ఉల్లాసంగా
ఉత్సాహంగా
ఉత్సవంలా
ముందుకు
మునుముందుకు...
కొండలు శిఖరాలు
నదీ నదాలు
వాగులు వంకలు
సెలయేళ్ళు జలపాతాలు
రాళ్ళూ రప్పలు
ముళ్ళూ తుప్పలు
ఏవీ అడ్డంకావు
ఆశయ సాధనకై
కదలబారడమే...
నేలరాలుతున్న
మోదుగు పూలను
ఏరుకుంటూ
జ్ఞాపకాలన్నీ
వలబోసుకుంటూ
తీర్చాల్సిన బాకీలు
తీర్చుకుంటూ
గమ్యంవైపు
వెన్ను చూపక
సాగుతున్న
లాంగ్ మార్చ్..
Friday, April 27, 2012
Wednesday, April 25, 2012
నైవేధ్యం...
నువ్వు నిర్మించిన
ఆకాశపు నిచ్చెన
చేరలేని
ఈ నిస్సహాయత
వెనకే
నీడలా
వెంటాడుతోంది...
అహర్నిశలూ
నీకంటూ
ఏమీ మిగుల్చుకోని
క్షణాలతో
నీవల్లిన
ఈ గుజ్జనగూళ్ళు
నిర్లక్ష్యపు
చెదపట్టి
ఒట్టిపోయినాయి...
చేతుల్బార్లా జాపి
నీ భుజాన
ఈ భారాన్నంత మోస్తూ
నీవీదిన
ఈ అనంత సాగరం
నీ మనోబలం ముందు
చిన్నబోయినాది...
తండ్రీ
నేడు నా
కన్నీటి గూటిలో
ఓ నెత్తుటి చుక్కను
నైవేధ్యంగా
సమర్పించుకుంటున్నా...
ఆకాశపు నిచ్చెన
చేరలేని
ఈ నిస్సహాయత
వెనకే
నీడలా
వెంటాడుతోంది...
అహర్నిశలూ
నీకంటూ
ఏమీ మిగుల్చుకోని
క్షణాలతో
నీవల్లిన
ఈ గుజ్జనగూళ్ళు
నిర్లక్ష్యపు
చెదపట్టి
ఒట్టిపోయినాయి...
చేతుల్బార్లా జాపి
నీ భుజాన
ఈ భారాన్నంత మోస్తూ
నీవీదిన
ఈ అనంత సాగరం
నీ మనోబలం ముందు
చిన్నబోయినాది...
తండ్రీ
నేడు నా
కన్నీటి గూటిలో
ఓ నెత్తుటి చుక్కను
నైవేధ్యంగా
సమర్పించుకుంటున్నా...
Tuesday, April 24, 2012
నిరీక్షణ...
ఈ ఒంటరి వేళ
నా రెక్కలు విరిగి
రెప్పలు బరువయ్యేట్టు
ఎదలో ముల్లు గుచ్చుకొని...
నీ వెండి వెన్నెల నవ్వు కోసం
ఈ అంచున నే వేచేవేళ
ఈ రేయినింక
అమవాస చేయకు...
వెలితి ఎప్పుడూ ఆకాశమంత
విస్తరిస్తూనే వుంటుంది..
ఆశ ఎప్పుడూ నక్షత్రంలా
మిణుకు మిణుకు మంటూనె వుంటుంది....
ఎండిన గొంతును చేరిన
వాన చినుకు తడిపినంత మేరా
మరల ఎండ ఆరబెడుతూనే వుంటుంది...
నా రెక్కలు విరిగి
రెప్పలు బరువయ్యేట్టు
ఎదలో ముల్లు గుచ్చుకొని...
నీ వెండి వెన్నెల నవ్వు కోసం
ఈ అంచున నే వేచేవేళ
ఈ రేయినింక
అమవాస చేయకు...
వెలితి ఎప్పుడూ ఆకాశమంత
విస్తరిస్తూనే వుంటుంది..
ఆశ ఎప్పుడూ నక్షత్రంలా
మిణుకు మిణుకు మంటూనె వుంటుంది....
ఎండిన గొంతును చేరిన
వాన చినుకు తడిపినంత మేరా
మరల ఎండ ఆరబెడుతూనే వుంటుంది...
ఏదో వేడి గాడ్పు వీచిన వేళ
నీ చిరునవ్వొకటి
ఓదార్పునిస్తుంది కదా ప్రియతమా...
అది ఋణమో లేక
సుదీర్ఘ నిరీక్షణా ఫలమో కదా...
కాదా?
ఏవో ఏవేవో సుడిగుండాల
మాటున చినిగిన తెరచాపల పయనం
తీరం చేరక ఒడ్డున ఒరిగిపడిన
జనమ జనమల బంధం...
మరల మరల
ఈ ఎదలోపలి శూన్యాన్ని
పూరింప తన కోసం
ఎన్నటికీ తెగని
ఈ నిరీక్షణ...
నిర్వేదం కానీయక
ఈ వేళ
నా గాయాల మాన్ప
నీ వేణువు పిలుపు కోసం...
నువ్వా? నేనా??
అంటూ
ఈ ప్రశ్నల కొడవళ్ళతో
కాలాన్ని కోయక
నను నీ బంధీని చేయగ రావా
ప్రియా..
నీ చిరునవ్వొకటి
ఓదార్పునిస్తుంది కదా ప్రియతమా...
అది ఋణమో లేక
సుదీర్ఘ నిరీక్షణా ఫలమో కదా...
కాదా?
ఏవో ఏవేవో సుడిగుండాల
మాటున చినిగిన తెరచాపల పయనం
తీరం చేరక ఒడ్డున ఒరిగిపడిన
జనమ జనమల బంధం...
మరల మరల
ఈ ఎదలోపలి శూన్యాన్ని
పూరింప తన కోసం
ఎన్నటికీ తెగని
ఈ నిరీక్షణ...
నిర్వేదం కానీయక
ఈ వేళ
నా గాయాల మాన్ప
నీ వేణువు పిలుపు కోసం...
నువ్వా? నేనా??
అంటూ
ఈ ప్రశ్నల కొడవళ్ళతో
కాలాన్ని కోయక
నను నీ బంధీని చేయగ రావా
ప్రియా..
Subscribe to:
Posts (Atom)











