Showing posts with label అంతరంగం. Show all posts
Showing posts with label అంతరంగం. Show all posts

Thursday, June 18, 2020

అజ్ఞాత

నీ చుట్టూ ఒక వల ఏదో కంటికి కనిపించని
                                 దారంతో నేయబడి

సీతాకోక చిలుకలు ఎగురుకుంటూ
                                గుంపుగా వచ్చి

చిక్కుపడి దారమంతా రంగులమయమై
                                      పైకి తేలిపోయి

దాని చుట్టూ కొన్ని పిచుకలు మూగి
                                 మౌనాన్ని కరిగిస్తూ   

నెత్తురోడి రెక్కలు తెగి వర్ణ రహితమైన
                                    సీతాకోకచిలుకలు

కొన్ని చినుకులేవో ముక్కలుగా పగిలిన వేళ
                                          భారంగా

గాలి ఏదో దు:ఖ గీతాన్ని ఆలపిస్తూ
                        కనురెప్పలను తాకుతూ

వెదురు చివుళ్ళు మధ్య  చిక్కుకుంటూ
                                 శూన్యావరణంలో

కను రెప్పలకావల దాగిన చెలమలో
                                      ఇగిరిపోతూ!

Saturday, September 28, 2013

ఒక్కో సారంతే...

 
అలా నడుస్తూ వుంటాం
గట్ల మీదుగా దుక్షిణిపుల్లల విత్తులంటుకోని వదలనట్టుగా
అర చేతులకు గీర్లు పడుతూ

చెప్పులతో పాటు అరికాళ్ళనిండా ఇంత ఒండ్రు మట్టి అంటుకొని
ఎన్ని నీళ్ళతో కడిగినా ఏదో జిగురుగా ఇంకా వదలనట్టుగా
ఒక ఎఱని చార అగుపడుతూ

అర చేతులగుండా వేళ్ళ మధ్యనుండి జారుతున్న దారాన్ని ఆసరాగా
ఎగరేసిన గాలిపటం ఆకాశపుటంచులు తాకుతున్న సమయంలో
తెగిపోయిన తోకచుక్కలా నేలరాలుతూ

కిల కిల మని బాతులగుంపొకటి చెరువునిండా ఈదుతూన్న సమయంలో
ఒక్కసారిగా గండిపడి ఇంకిపోయిన చెరువు గర్భంలో
బురదలో కూరుకుపోతూ

కళ్ళ ముందు పరచుకున్న పచ్చదనం ఒక్కసారిగా ఎడారైనట్టు
గుండెలోతుల్లో ఏదో బెంగ.. కూతురు తన వేలి చివర వదిలిపెట్టి వెళ్తూ
ఇంత పిరికిదనాన్ని మూటగడుతూ

కొన్ని సమయాలు కొన్ని ఏకాంతాలను కలగలుపుతూ యింత ఒంటరితనాన్ని
గుంపులోంచి తీసి మీద జల్లి చినుకులన్నీ ఆవిరయి నల్ల మబ్బేదో
కళ్ళ మద్య కలల్ని కత్తిరిస్తూ


(తే 27-09-2013 దీ రాత్రి 11.11)

Friday, June 29, 2012

కలుపుకు పో!!!


అప్పుడే లాలించే తల్లిలా దగ్గరకు తీసుకుంటావు
అంతలోనే అలా విదిలించి వదిలేస్తావు....
అప్పటికప్పుడే కరిగిపోయె మనసుతో మరులొలికిస్తావు
ఇంతలోనే మునిలా ముడుచుకుపోతావు....

రా!!! రమ్మని రాగ దీపం వెలిగిస్తావు
వచ్చేలోపే మూడో కన్ను తెరుస్తావు....
అయినా పాలనురుగులాంటి నీ మనసు నాకు తెలీదా
ఆప్యాయతానురాగాల వెల్లువ కనబడనీయకుండా దాచే
నీ విఫలయత్నం నవ్వులు విరిసే నీ కన్నులు దాయలేవు కదా!!!

ప్రియా!!! నీవు మౌనమైన క్షణాలన్నీ నా మృత ఫలకాలే....
అవి నా సమాధి పై పేర్చబడుతున్న రాళ్ళే కదా!!!
గల గల పారే గోదావరి ఉరవడిలో నన్ను కలుపుకు పో
ఈ వరమొక్కటివ్వు చాలు నాకు....
ఆజన్మాంతం నీ పాదాక్రాంతుడినై వుంటా!!!
Related Posts Plugin for WordPress, Blogger...