Friday, August 14, 2015

కొన్ని సాయంత్రాలు...



కొన్ని సాయంత్రాలు ధూళి మేఘం ఆవరింపబడి
గరకుగా మారిన కనుగడ్డు పగులుతూ

చెదరిన గూడు చేరక పక్షి కూనలు
బిక్కు బిక్కుమంటూ

కరకు గాలి కోతకు చిగుళ్లు తెగిన
చెట్ల విలాపం

విసురుగా కొట్టిన వాన పాయతో
గజగజలాడుతున్న పిల్లలు

భయావరణంలో ఆత్మలింకిన 
ఒంటరి దేహాలు

అవును
కోల్పోతున్న ఒక్కొక్క పరిచయ స్పర్శ
నిన్నొక ఒంటరి ప్రమిదలో దీపం చేసిపోతుంది..

Sunday, August 2, 2015

దుఃఖాగ్ని..

నిప్పులు 
చిమ్మే 
కన్నీళ్ళు 
హృదయం
నుండి
ఎగసిపడుతూ
ఉగ్గబట్టిన
దు:ఖం
పిడికిలిలో
పెరపెరమంటూ
దేహమంతా
అగ్ని
ఆవహిస్తూ
దహిస్తూ
నెత్తురు
చిమ్మి
నిప్పులు
చెరగుతూ
లోలోపల
లావా
పెల్లుబుకుతూ
నన్ను
నేను
పునర్నవిస్తూ!!

అభ్యర్థన..

కొద్దిగా ఒత్తిగిలి
ఈ ఆకుల ఆకాశం పైకప్పు కింద
కాసింత విశ్రమించనివ్వండి

ఈ నేలను ఇంకిన ఈ చినుకు విత్తును
కాసింత మొలకెత్తనివ్వండి

ఈ సెకనుకు సెకనుకు మధ్య ఖాళీని
కాసింత పూరించనివ్వండి

ఈ మెలకువకు సుషుప్తకు మధ్య
కాసింత విరామమివ్వండి

ఈ స్వప్నాన్ని ఆ వేకువ కొక్కేనికి
కాసింత వేలాడనీయండి!!

దేహ సంచారం..

కొన్నంతే
అలా
తగలబడి పోవలసిందే

స్నేహం ప్రేమ ఇంకా ఏవేవో
అన్నీ అలా

గుడ్డ బంతిలా
జారి ఎగిరిపోతూ
కుప్పకూలుతూ

మనుషులం
అనుకోవడమే తప్ప
బతుకుతున్నామా?

ఇంత
మోసపూరిత లోకంలో 
ఆత్మలేని
దేహసంచారం..

చిరిగిన వస్త్రం

కొన్ని సాయంత్రాలకు మనసు చిరిగిన
వస్త్రంగా విడిపోతుంది

రంగులన్నీ వెలసి ఓ మాసిన
దారప్పోగులా వేలాడుతోంది

కుప్పబోసిన పసి కలలన్నీ కోరికల
పాదాలకింద అణగిపోతాయి

సంధి కాలం ఇనుప తెరగా మారి
సరిహద్దులు గీస్తుంది

నువ్వంటావు 
స్వేచ్ఛగా ఎగురని
పావురాయి బతుకుతుందా అని

అవును
కాల యవనికలో ఇంద్రధనస్సును
హరించే కాటుక మేఘం కాకూడదు కదా??

కవిత్వం కావాలి

ఇప్పుడు కొద్దిగా కవిత్వం కావాలి
కాసింత ఓదార్పుగాను
కాసింత దాహం తీర్చేదిగాను
ఇంకొంత దహించేదిగాను
వున్న కొన్ని
అక్షరాలను
కుప్ప పోసే
కవిత్వం
కావాలి


గోడపై వాలిన కనుగుడ్డు నిండా
పరచుకుంటూ
గొంతును చీలుస్తూ
ఉబికి వచ్చే
ఎర్రటి నినాదంలాంటి
కవిత్వం కావాలి

అటు ఇటూ పరచుకున్న
చీకటిని చీలుస్తూ
పౌర్ణమి రాత్రి
సంద్రం అలలపై
పరచుకునే
బంగరు తీగలలాంటి
కవిత్వం కావాలి

ఎగసిపడిన
అలల నురుగుతో
సర్రున ఒడ్డుకు చేరుతూ
పాదం కిందుగా ఇసుకను ఒరుసుకుంటూ
శిరసు వరకూ పాకే

చల్లని పాదరసం లాంటి
కవిత్వం కావాలి

కాలిన ఇనుముపై
పడ్డ సమ్మెట దెబ్బలాంటి
బలమైన విసురైన
ఒడుపైన
కవిత్వం కావాలి

నేస్తమా అంటూ
అలాయి బలాయి
చెప్పి ఎదకు హత్తుకుని
కాసిన్ని దుఃఖపు చినుకులను
రాల్చే
పసి హృదయపు
కవిత్వం కావాలి


వి
త్వం
కావాలి. 

Tuesday, June 16, 2015

అతడే జవాబు..


కొన్ని సాయంత్రాలకు దుఖం వేలాడబడుతుంది
తెగిపోయిన వేళ్ళ చివర నెత్తురు గూడు కడుతుంది

చిగురించిన ఆకు చివరల ఒక
ప్రశ్న మొలకెత్తుతుంది

నువ్వొక జవాబువి కాలేదని తెలిసి
రాలుతున్న పిల్లెట్లన్నీ కుప్పబడతాయి

నీ నుదుటిపై పోస్ట్ మార్టం కుట్టు రోకలిబండలా 
నన్ను నిద్రకు దూరం చేస్తుంది

నువ్వింకా ఆ చౌరస్తాకు అడ్డంబడి వాడికెదురుగా
అరుస్తున్నట్టే వుంది

వాడి చేతిలో చిక్కిన నీ జుట్టు ఇంకా
రాలిపడలేదు

ఆ నల్లగేటుకు తాకిన నీ అరచేతి రేఖల
ముద్రలు ఇంకా కరిగిపోనూ లేదు

నువ్వంటావు పోరాటం ఎప్పుడూ కొనసాగింపే
కదా అని!

అవును
నువ్వెత్తి పట్టిన జెండా
అవనతం కాలేదు కాబోదు
భుజం మార్చుకుంటుందంతే కదా??

(కామ్రేడ్ వివేక్ స్మృతిలో)

Thursday, May 14, 2015

వెదురు పూలు..


రాత్రికి ఈ గోడ నిండా ఓ నినాదమై
కంపించాలని వేళ్ళనిండా రంగు పూసుకొని

అతను ఆమె రహస్యంగా నడుస్తూ
ఇంత వెలుతురుని వెదజల్లుతూ

అక్కడక్కడా ఏరిన తురాయి పూలను
అగ్ని పింఛంలా ధరిస్తూ ఆమె

గాయమైన స్వప్న శకలాలకు వెదురు పూల 
రెక్కలు అతుకుతూ అతను

దూరంగా ఆకాశ పాదాన ధింసా ఆడుతూ 
సూరీడు సందురూడు!!

చీకటి గానం..


కొన్ని సాయంత్రాలకు పాదాలు చెరబడ్తాయి
ఎగురుతున్న పావురాయి రెక్క తెగి
నేలకు రాలుతుంది

గొంతుపై ఉక్కుపాదం తొక్కుతూ
నినాదాలు గాయాలవుతాయి

వేసవిని పూసుకుని అడవి ఆకురాలి 
కరకరమంటు మండుతుంది

నువ్వంటావు చీకటి ముసిరిన వేళ
పాట కట్టలేవా అని!

అవును 
చీకటింట చీకటే గానం చేయబడుతూ
ఒక్కొక్కరూ కదలబారుతారు!!

ప్రమిద-నువ్వూ...


ఈ రాత్రికి ఇన్ని మాటలు లేకుండా పొదిగినది
నువ్వే కదా

కొన్ని వాడిన పూరేకులలా మూలగా విరామంగా
సేదదీరుతూ

నువ్వడిగిన మట్టి గాజులు మరచి పోయి
వెలసిపోయిన ముఖం

ఈ ప్రమిదనిలా ఒంటరిగా ఆరిపోనివ్వు
ఒక్కో చినుకులా!!

నూలు దారాలు...


నీటి పాయలుగా విడివడిన దేహాలు
తేట తెల్లంగా మెరుస్తూ

అరచేతులలో రేఖలగుండా
సరిహద్దులను చెరిపేస్తూ

పున్నమి రోజు కురిసిన
నిన్నటి వానలా వెన్నెలను మింగేస్తూ
కాసింత చీకటి దాహమేదో గొంతును నులిమేస్తూ

నువ్వంటావు నిన్నటి ఆ ఛాయా మేఘాన్ని
అదృశ్య హస్తమేదో మాయం చేసిందా అని!

చూడలేదా నువ్వు ఆ సాయంత్రం
కొన్ని రంగుల నూలు దారాలు ఎగిరిపోవడాన్ని!!

Monday, April 27, 2015

కొన్ని సాయంత్రాలకు రూపం వుండదు..

కొన్ని సాయంత్రాలకు రూపం వుండదు
కడవలకొద్దీ కన్నీళ్ళు బూడిదలో కలిసి
దేహమంతా కూరుకుపోతుంది!
అక్కడక్కడా మిగిలిన గురుతులన్నీ
దర్వారాలుగా కుప్పకూలిపోతాయి!
రహదారులన్నీ చీలిపోయి పగిలిన
బీళ్ళలా నోరుతెరుచుకుంటాయి!
ఒక్కసారిగా ఆకాశం ధూళి మేఘంలా
విరుచుకుపడి భూస్థాపితం చేస్తుంది!
తవ్విన కొద్దీ గుండె పగుళ్ళు మధ్య
నెత్తుటి ఇటుకల శిధిల విలాపం!
నువ్వంటావు కన్న పేగునెవరో
కసిగా తెంపివుంటారా అని!

అవును
ఆత్మలన్నీ సామూహిక దహనకాండలో
కరిగిపోయి దు:ఖావరణాన్ని మిగిల్చాయి!!

అచ్చులో రెండు కవితలు

ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో తే26/04/2015దీ.

నవ తెలంగాణా 'దర్వాజా' పేజ్ లో తే27/04/2015దీ.

Thursday, April 16, 2015

దు:ఖపు చినుకు..


గాలికి కాసింత రంగునద్దుదామని
ఇన్ని గోరింటాకులు ఏరి తెచ్చా

కానీ గాలి ఆ కొండ మలుపుని దాటగానే
ఓ పావురం నెత్తురంటి ఎర్రగా కుంగిపోయింది!

పాటకింత పరిమళాన్ని జతచేద్దామని
ఇన్ని మల్లెలు గుది గుచ్చి తెచ్చా

కానీ పాట ఆ అడివంచు చేరగానే
గొంతు తెగిన కోయిలొకటి కూలిపోయింది!

ఒక దు:ఖపు చినుకు రాలి
నేల తల్లికి గర్భస్రావం అయింది!!

Wednesday, April 15, 2015

కొనసాగింపు..


అవును 
ఈ పాత పాళీ పెన్ను
సిరా ఇంకి పోయి రాయడం మాని
ఇలా చాన్నాళ్ళుగా ఒరిగిపోతూ వుంది!


ఈ పాత డైరీ అట్ట చెద తిని
అసంపూర్ణంగా రాయబడి
ఇలా చాన్నాళ్ళుగా చినిగిపోతూ వుంది!


నువ్వంటావు
ఎప్పుడూ ఆ పాత వాటి మధ్యలో
పెచ్చులూడిన గోడ వారగా వుంటావెందుకూ అని!


నేనంటానూ
ఈ పాత పెన్ను చెద రాలుతున్న డైరీ
ఈ పెచ్చులూడుతున్న గోడ నన్నిలా నిలబెట్టే
నా అసంపూర్ణ కొనసాగింపు అని!!

Tuesday, April 7, 2015

వెలుతురు కట్టిన పాట...


చీకటినలా దోసిట పట్టి విసిరేస్తావు 
మిణుగురులు అలా మెరుస్తూ కురుస్తున్నాయి

చుట్టూ పరుచుకున్న వెలుతురునింత 
పోగు చేసి బొమ్మ కడుతున్నా

ఇన్ని మందార ఆకులు  పరచి 
గూడు అల్లుతున్నా

చుట్టూ ఇన్ని బంగారు పిచుకలు 
ఎగురుతు ఏవో పాటలు కడుతున్నాయి 

నువ్వంటావు నీ మాటలు
వినపడ్డం లేదని 

అవును నా గొంతు 
రాగమై గాలిలో కలిసి పోయిందని
.
.
.
.....

Wednesday, April 1, 2015

కాగితం..


మనసెప్పటికీ
ఓ తెల్లకాగితం!


నువ్వు విసిరేసినప్పుడంతా
గాయపడిన ఎర్రని కాగితం!


గాలికీ భారమై 
చినిగిన చిత్తు కాగితం!!

Saturday, March 28, 2015

రాతి రెప్పలు..


ఇక్కడో చిత్రకారుడు అక్షరాలకు
నెత్తుటి తడిని అద్దుతూ
దేహాన్ని చిత్రిక పడుతున్నాడు

కనులకంటిన చెమ్మను కోల్పోతూ
రాతి రెప్పలను చెక్కుతూ
నరాలను పేనుతున్నాడు

రాలిన కలలను పేరుస్తూ
వాన నీటిలో రెక్కలూడిన 
తూనీగకు రంగులద్దుతున్నాడు

ఇన్ని రాలి పడిన పసిపాపల
కనురెప్పలను ఏరుతూ
నిచ్చెన కడుతున్నాడు

తెగిన దారం చివర గాలిపటాన్ని 
ఎగరవేస్తూ పావురం 
గాయానికి లేపనమవుతున్నాడు..

Saturday, March 21, 2015

నీళ్ళ రంగు చిత్రం


కలలు రాని కంటి తెరపై 
నువ్వో నీళ్ళ రంగు చిత్రాన్ని ఆవిష్కరిస్తావు

కరిగిపోతున్న కాలం తెరచాపపై 
చినుగును అతుకుతూ

రాలుతున్న ఆకుల ఈనెలపై 
ఒక్కో అక్షరం  నెత్తురోడుతూ 

ఈ చెరువు అలల మధ్య 
తెగిపడిన దేహంతో జ్వలిస్తూ

నిర్వికల్ప సంగీతాన్ని మౌనంగా 
ఆలపిస్తూ 

............

Wednesday, March 11, 2015

ఇసుక పంజరం


నిశ్శబ్దావరణాన్ని సృష్టించుకొంటూ

రావి ఆకుల ఈనెల మధ్య ఒదిగిపోతూ

నాకు నేనుగా ఈ ఇసుక పంజరాన్ని మోస్తూ

నెత్తుటి తీగల మధ్య వేలాడుతున్న పక్షిలా

కాసేపు విశ్రాంతిని తీసుకోనివ్వు
Related Posts Plugin for WordPress, Blogger...