Showing posts with label కవిత - సంభాషణ. Show all posts
Showing posts with label కవిత - సంభాషణ. Show all posts

Sunday, August 2, 2015

అభ్యర్థన..

కొద్దిగా ఒత్తిగిలి
ఈ ఆకుల ఆకాశం పైకప్పు కింద
కాసింత విశ్రమించనివ్వండి

ఈ నేలను ఇంకిన ఈ చినుకు విత్తును
కాసింత మొలకెత్తనివ్వండి

ఈ సెకనుకు సెకనుకు మధ్య ఖాళీని
కాసింత పూరించనివ్వండి

ఈ మెలకువకు సుషుప్తకు మధ్య
కాసింత విరామమివ్వండి

ఈ స్వప్నాన్ని ఆ వేకువ కొక్కేనికి
కాసింత వేలాడనీయండి!!

Saturday, October 6, 2012

ఏమవుతావో!!


నాకేమవుతావో నువ్వని
చిలిపిగా అడిగితే ఏమని బదులీయను...

నాలో సగమైనావని
నా ఊపిరిలో భాగమైనావని
నా కనులలో కాపురమున్నావని
నా ఎదలో కొలువైనావని
నా మనసునిండా నువ్వే వున్నావని చెప్పనా?

నీ ఎడబాటు భరించలేనంత బేలగా మారానన్నది
నీ గుండెకు తెలియదా చెలీ...

మన పరిచయం చిగురించిన నాటి నుండి
ఓయ్ అన్న నీ పిలుపు గుండెలో అల్లరి చేస్తుంది...

ప్రియతమా!
నీ ఊసుల ఊహల ఊయలలూగు ప్రతి క్షణం నాకు పరవశమే...

Friday, February 17, 2012

తను.... నేను.....









తను
...

ఎందుకంటే ఏమి చెప్పను?
ఎన్నో చెప్పాలనుకుంటాను
ఏదేదో చెప్పేస్తూ ఉంటాను
చెప్పాలనుకున్నవి చెప్పను
మిమ్మల్ని విసిగిస్తూ వాగేస్తాను
మార్చుకోవాలనే ప్రయత్నిస్తాను
రేయంతా మనసుని మభ్యపెడతాను
మొరాయిస్తున్న మనసుని జోకొడతాను
ఉదయాన్నే కాస్త మౌనం దాలుస్తాను
నిముషంలో నిర్ణయం మార్చుకుంటాను
ఎందుకిలా అనడిగితే ఏమని చెప్పను?
ఇది ఎందుకో ఏమో అని ఎలా చెప్పను?

నేను...


నేను అంతే
మాటాడుతూ ఒక్కసారిగా మూగగా ఐపోతుంటాను
మాట రాని మౌనమేదో కమ్ముకుని
నాలో నేను దాగిపోవాలని
ఓ విఫలయత్నం చేస్తుంటాను

కానీ
నీ ఊహ గుహాంతర్భాగంలోంచి
దూసుకొచ్చిన వేట పులిలా కమ్ముకొని
ఒక్కసారిగా ఆవహించి
నిలువనీయదు కదా...

అది తప్పో ఒప్పో
మనసు ఒప్పుకోదే..

ఇది తప్పొప్పుల మీమాంస సమయం కాదని
హృదయ లయలలో ఓ రాగం సన్నగా
మీటుతుంది...

ఇంక ఉప్పొంగిన నెత్తురు
లావాల విరజిమ్మి ఒక్కసారిగా
ముందుకు నెడుతుంది....

అప్పటికి నీవు అప్పుడప్పుడు
ఎగరేస్తున్న ఎర్ర జెండా కంటికి
అగుపడదే....

ఇలా చెప్పుకుంటూ పోతే
హృదయం తేలికవుతుందా...

లేదే...
మరింత గాఢమైన వనంలోకి
చొరబడ్డ దారితెలియని జింకపిల్లలా
విల విలలాడుతూ
దాహార్తితో
నీ ముందు దోసిలితో...


(ఓ రెండు హృదయాల సంభాషణ)
Related Posts Plugin for WordPress, Blogger...