Wednesday, April 18, 2012

శివునికి జోహార్లు



 
విప్లవం
శ్వాశించినవాడా..
ఎలుగెత్తి నినదించినవాడా..
గొంతెత్తి గానం చేసిన వాడా...

అమ్మా నను కన్నందుకు
విప్లవాభివందనాలు
తెలిపిన వాడా...

ఊరూ వాడా
ఏకం కావాలని
కలలు కన్నవాడా...

నిరాయుధుల చేతిలో
ఆయుధమై
విప్ప వనాల గాలిలో
తుపాకీ మందు వాసనగా
మారిన వాడా...

నిత్యం
జ్వలించిన వాడా...
పాటల తూటాలను
మాలగా ధరించిన వాడా...

స్వప్నాలను
నెలవంకలను
ఎరుపెక్కించిన వాడా...

ఉద్యమ నెలబాలుడిలా
అడుగులేసి
నేల నాలుగు చెరగులా
విస్తరించిన వాడా...

తుపాకీ గొట్టాన్నే
వెదురు వేణువుగా
మలచి గాయాలకు
పాటల పూత పూసిన వాడా...

నాడు
ఉల్కలా నేల చేరి
నేడు
అరుణతారలా
నింగికి చేరుకున్నవాడా...

దోసిలిలో
కాసిన్ని మోదుగు పూలు
ఇన్ని విప్పపూలు
ఇన్ని మందారాలు
మరికొన్ని ఎర్ర గులాబీ రేకులుతో పాటు
విల్లంబులతో
నీ ముందు నిలుచున్నా...

జోహార్లు
జోహార్లు
అమరుడా
జోహార్లు...
 

(కా.శివసాగర్ ఫోటో  తీసినది ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ భరత్ భూషణ్  గారు...)

 

కరిగిపోవాల్సిందేనా...



నేను నీ కోసం
నా ఊపిరి చివరాఖరి వరకు
వేచి వుంటానన్న
ప్రమాణం తెలిసే యిలా
ప్రశ్నిస్తావా...

నీకోసం
వేయి జన్మలైనా వేచి వుంటా కదా...

మన మధ్య వున్నది
ఒట్టి వాంచకాదు కదా..

ఆత్మ యోగ సంయోగం
కదా...

కాలం కరిగిపోనీ
భూమి సంద్రం ఏకమవ్వనీ
ఆకాశం నేలలో ఇంకనీ
ఎనిమిది దిక్కులూ ఏకమవ్వనీ

ఏమైనా కానీ
నీ కోసం వేచి వుంటా నేస్తం..
నీ పాట పల్లవినౌతూ..

మాటలన్నీ కలిపి ఒకే పల్లవైన వేళ...
చరణాలన్నీ నీ శరణుజొచ్చిన వేళ...
నేనంటూ ఏమీ మిగలని వేళ...

ఇలా
నన్ను ఒంటరిని చేసి
నీ చూపుల కంటి చివర
కాటుక కరిగి
నా చిత్రం
కరిగిపోవాల్సిందేనా...

Sunday, April 15, 2012

హారతి..


లేదు మొఖాన ఏ ముసుగూ
లేను ఏ తెర వెనుకా...

కాసింత ప్రేమగా పలుకరిస్తే చాలన్న
దాహమే నన్ను నీ స్నేహానికి దగ్గర చేసింది...

ఎలావున్నావు అన్న మాట కదా
నన్ను నీ దరికి చేర్చింది...

ఎన్నో యుగాలుగా బీడైన హృదయపు 
నేలపై కురిసిన తొలకరి జల్లులా నీ పలుకరింపు...

చిగురించిన స్నేహపు లేలేత తొడిమ
నీ చేతిలోనే వుంది...

తుంచి వేస్తావో? లాలనగా తడిమి
అక్కున చేర్చుకుంటావో...

కరిగిపోతున్న నా కాలపు కొవ్వొత్తి
చివరాఖరి వెలుగుతో నీకు హారతిద్దామని...
Related Posts Plugin for WordPress, Blogger...