
కొలమానం లేని
మా సెమట సుక్కలను
ఖరీదు కట్టనీకి
ఎన్ని మాయలో!
ఎన్ని జనమలెత్తినా
ఈ నెత్తిన తట్ట మారలే!
కరకరమని ఎముకలు
విరుగుతున్నా
తప్పని మోత!
ఎన్ని ప్రణాళికలు వేసినా
అవి మా కన్నీటిని
తుడవకపోగా
మరింతగా మా
మూలుగును
పీలుస్తూనే వున్నాయి!
ఈ రూపాయి
సంబంధమిలా వుండగా
పెనిమిటి లమ్డీ కొడుకు
మగపురుగు బుద్ధిని
మాపై రుద్దకమానడు!
అరకొర కస్టాన్ని
తానొక్కడి సంతోసానికి
మింగి మళ్ళీ నాపై
అఘాయిత్యం సేస్తానే వుంటాడు!
ఆకాసం సూడనీకుండా
తట్టడు బరువు నెత్తిన!
తళుకు సీరల
అమ్మలుది
ఓ బాధైతే
నాది నిరంతర
ఱంపపు కోత!!
(అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం సందర్భంగా)