Showing posts with label కవిత - జ్ఞాపకం. Show all posts
Showing posts with label కవిత - జ్ఞాపకం. Show all posts

Sunday, June 5, 2016

ఈ గోడమీద..

మీ పేర్లు
ఒక్కొక్కటి
రాస్తూ

కొన్ని
నెత్తుటి చుక్కల
మధ్య


బాలింతరపు
వాసన

అవును
మిమ్మల్ని
మరిచిపోనివ్వని


ఆకు సవ్వడి
గుండెనలా
ఒత్తిపడుతూ!!

Sunday, August 26, 2012

వెలుతురు పిట్టలు...

అలా ఓ చాప చుట్టలో ఎర్రటి ముద్దలా
నువ్వొచ్చి వెలుగుతున్నప్పుడు....

అంతా గుమిగూడి నీ పేరు చుట్టూ
ఓ గేయాన్ని ఆలపిస్తున్నప్పుడు...

అమ్మ తన కంటి ధారను రెప్పల మాటున
ఉగ్గబట్టి నీ కనుపాపలు ముద్దాడుతున్నప్పుడు...

నీ ఒంటి గాయాలను తడుముతు వేళ్ళ చివరి అంచుల
నాన్న వెన్నపూసవుతున్నప్పుడు...

ఆమె దు:ఖాన్ని గొంతులో సుళ్ళుతిరుగుతుండగా
నేలపై నీ పేరును ముగ్గు వేస్తున్నప్పుడు...

గోధూళి వేళ లేగ దూడ మూగగా
తల్లి పొదుగును చేరక దిగులుపడుతున్నప్పుడు...

తూర్పు వాకిట కాకులన్నీ గుంపుగా
నీ చావు అబద్ధమని చాటుతున్నప్పుడు...

వెలుతురు పిట్టలు నీ గుండెలపై
ఎర్ర వస్త్రం అలంకరిస్తున్నప్పుడు....

నెత్తురు చిమ్మిన ముఖంతో సూరీడు రేపటి ఉదయాన్ని
వాగ్ధానం చేస్తూ నేల తల్లి ఒడిలో వాలిపోతూ.....

Thursday, August 16, 2012

ఆటోగ్రాఫ్...


వడిగా విడిపోతున్న వలయాల మధ్య
ఓ కిరణంలా దూసుకుపోతూ నువ్వు....

ఒక్కో సంకెలా తెగిపడుతున్న వేళ
ఓ గజ్జెల మోతలా తాండవిస్తూ నువ్వు....

రెప రెపలాడుతున్న జెండా గుడ్డలా
ఒకే రంగులో అలరిస్తూ నువ్వు....

రహస్యాలన్నీ ఉల్లిపొరలా వీడిపోతున్నప్పుడు
డప్పుల మోతలా మోగుతూ నువ్వు....

అచ్చెరభ శరభా అంటూ ఊరేగింపు సాగుతున్న వేళ
చంద్రప్రభలా ప్రభవిస్తూ నువ్వు....

యిన్ని దీపకాంతుల వరుసల మధ్యగా
ఓ తారాజువ్వలా మండుతూ వెలుగుజిమ్ముతూ నువ్వు.....

ఆశయాల అరచేతుల కలయికలో
గట్టిగా బిగించిన పిడికిలిలా నువ్వూ నేను.....

చివరి చిరునవ్వు సంతకంతో
నీవందించిన ఆటోగ్రాఫ్ చెరగని ముద్రతో నేనిలా....

Sunday, August 5, 2012

మళ్ళీ కలుసుకుందాం...

నువ్వలా నాకంటే ఎప్పుడూ త్వరగా తొందరగా వేగంగా
నడుచుకుంటూ వెళ్ళీపోతూ తిరిగి నవ్వుతూ చూస్తుంటే
నా ఆయాసానికి నాకే నవ్వొచ్చేది....

కానీ నీ నడక అలా ఆ చందమామ దాకా సాగిపోయిందని
ఇప్పుడే తెలిసి ఒక్కసారిగా ఏదో మబ్బు ముఖాన
యింత మసి రాసిపోయినట్టై గుండే చుట్టూ వరద గూడు కట్టింది నేస్తం...

నువ్వు ఒరే అనక నేనేదో పెద్ద వాడిలా
చేస్తున్న నౌకరీకి గౌరవించి పిలిస్తే ఒక్కటిచ్చుకొని అలా కాదురా
మునుపు లాగే ఆప్యాయంగా పిలవరా అన్న
నా మాటకు నీ గుండెకత్తుకున్న జ్నాపకం నేడు నా కళ్ళలో ధారగా కురుస్తోంది....

స్కూలులో పంచుకున్న కూరల రుచి
ఇంకా నాలుకపై అలానే వుందిరా...

భుజంపై మనిద్దరి పుస్తకాల సంచీ బరువు
ఇంకా వేలాడుతూనే వుందిరా...

ఖాళీ అయిన నా పెన్నులో
నీవు నింపిన సిరా చుక్కలు యింకా మిగిలే వున్నాయిరా...

నాతో ఒక్క మాటైనా చెప్పకుండా
అలా ఉరుకులు పరుగులు పెడుతూ ఒంటరిగా పయనమయ్యావా మురళీ...

నాకోసం నీ పక్కనే ఒకింత చోటు వుంచు నేస్తం
మళ్ళీ కలుసుకుందాం ఓ బూందీ పొట్లంతో....

(ఈ రోజు స్నేహితుల దినం సందేశం తన మొబైల్ కు పంపించగా నా బాల్య మిత్రుడు మురళీ కొడుకు ఫోన్ చేసి తను చనిపోయి ఏడు నెలలయ్యింది అని చెప్పడం నాకు అశనిపాతమయ్యింది. అనారోగ్యంతో వున్నాడని తెలిసి పలకరిస్తే బాగయ్యిందిరా అని చెప్పాక మరల తనతో కాంటాక్ట్ లేక ఈ విషాదం ఇప్పుడే తెలిసింది.. ఈ రోజు ఈ వార్త ఇలా పంచుకోవాల్సి రావడం బాధాకరం)

Saturday, July 28, 2012

దోసిలిలో...

నువ్వేం చేస్తున్నావ్?
ఏం లేదు అలా నడుస్తూన్నా...

ఊరికే నడుస్తున్నావా?
అవును...

నీ దోసిలిలో గులాబీ రేకులు?
దారంతా జ్ఞాపకాలను ఏరుకుంటు వెళుతున్నా...

Friday, July 20, 2012

ఫీనిక్స్ లా...


ఇక్కడే
ఆగిపోయానుకదా?
నువ్వు చూసిన
ఈ మలుపు దగ్గరే...

స్మృతులన్నీ
ఒక్కోటీ ప్రతిసారీ
లోపలంతా
కోస్తూనే వున్నాయి...

నెత్తురంటిన
అక్షరాలన్నీ
పాట కట్టకుండానే
పారబోసావు కదా?

ఏదీ వదిలేయనూ లేక
ఏదీ అందుకోనూ లేక
ఓ చెట్టు మొదలులా
అటూ ఇటూ ఊగుతూ పాతబడి...

రాపిడవుతున్న
క్షణాలన్నీ లోలోన
దహిస్తూ అణువణువూ
బూడిదలా రాలుతోంది...

రాకపోతుందా
ఓ వాన మబ్బు!!
చినుకు పడి
మళ్ళీ ఫీనిక్స్ లా లేస్తా??

Tuesday, July 17, 2012

రాతి జ్ఞాపకం..


ఎత్తుగా ఓ పర్వతపు సానువులా
నిలువెత్తుగా...

శిలల ఆకృతులలో తమ ముఖాలను
వెతుక్కుంటు...

ఎవరో ఓ పక్క గాలి కోతకు తెగిపడిన తలతో
ఆడుకుంటూ...

చేయేదో ఆలవోకగా ఇలా ఎత్తిపట్టినట్టు
తేలియాడుతూ...

ముఖంపై పడుతున్న ముడతల మధ్య
దాగిపోతూ...

ఏదో సజీవత్వం అలా ఆ రాతి కళ్ళలో
గోచరిస్తూ...

యుగాల మలుపులన్నీ ఆ కాలి వేళ్ళగుండా
మరలిపోతూ...

ఈ రాతి జ్ఞాపకాలన్నీ ఒక్కోటీ
దొర్లుకుంటూ....

ఒక్కసారిగా గుండెలపై కూలబడ్డ
బరువుతనంతో....
Related Posts Plugin for WordPress, Blogger...