Saturday, September 19, 2009

నీవు వదలిన నీ నీడ జాడలో

desert

ఈ విశాల జీవన ఎడారి తోవలో

నీవు వదలిన పాద ముద్రలను వెతుకుతూ

అనంత తీరాల వెంబడి అణ్వేషణ సాగిస్తున్నా!

ఇవి ఒట్టి ఇసుక రేణువులా… కాదు

నీ అడుగు జాడల వెంబడి విరిసిన నక్షత్ర ధూళి!

నన్ను ఈ ఎండమావుల వదిలి నీవు

కానరాని తీరాల వెంట పయణమగుట భావ్యమా?

ఈ ఎడారి మూపున చిగురించిన

సగం కాలిన నెలవంక నీడల వెనక

నీవు వదలిన నీ నీడ జాడలో

నా ఈ వెతుకులాట…

సుదూరంగా

నీ నవ్వుల ఒయాసిస్సు

కనురెప్పల తెరల మాటుగా…..

Wednesday, September 9, 2009

ఎలాగోలా….

ఎలాగోలా బతికేయడానికి అలవాటుపడ్డాం

ఎవరేమనుకున్నా సరే

మనం, మన కుటుంబం, మన మోటారు సైకిలు/కారు

మన సెల్ బాలంస్, మన ఏ.టి.ఎం. కార్డు బాలెంస్

ఉంటే ఎవరెలా పోతే నాకేంటి,

నా పిల్లవాడి కాన్వెంట్ సీట్/కార్పొరేట్ కాలేజి చదువు

దొరికితే చాలు..

మంచి – చెడుల మద్య నున్న సన్నటి తెరను

చించేసుకుని బురఖాగా వాడుకుంటూ

నెపం ఎవరిమీదకో నెట్టేస్తూ

రోలింగ్ స్టోన్లా రోజులు దొర్లించేస్తున్నాం!

నిత్యం ఆత్మను చంపుకుంటూ చస్తూ బతుకుతున్న

బతుకూ ఒక బతుకేనా అని అర్ధరాత్రి

దుప్ప్టట్లో ప్రశ్నించుకొని తెల్లారి

మరల నుదుట నామంతో ప్రత్యక్షమవుతుంటాం!

ఎన్నాళ్ళీ మోసకారి బతుకులు?

అతకని మనసుల జతలు..

ప్లాస్టిక్ పువ్వుల నవ్వుల రువ్వులు..

Monday, September 7, 2009

అడవీ తల్లీకి దండాలో..

అడవి తల్లీకి దండాలో

మా కన్నతల్లీకి దండాలో…

అని గట్టిగా గొంతెత్తి పాడాలని వుంది

తన కడుపులో గుట్టుగా దాచుకున్న బిడ్డలను

మాటాడుదాం రమ్మని నమ్మకంగా ఇంత ముద్ద పెట్టి

వారు అడిగిన ఐదూళ్ళ వాటాను ఇవ్వలేదు సరికదా

తిరిగి తమ గూటికి ఆ పక్షులు చేరకముందే వారిని

దారికాచి గొంతుకోసిన నాటి నుంచి ఆగని నీ

కన్నీటి ధార మొన్న కుండపోతై, మెరుపుల జడివానై

వాడి అంతుచూసాక కాని నీ ఆక్రోశం చల్లారలేదు!

నీ వాకపల్లి పుత్రికల ఆవేదనకు ఇలా ముగింపు నిచ్చావు!

భూమ్మీదకాని, సముద్రంలోకానీ, ఆకాశంలోకాని, దేనివలన

మృత్యువులేదని వరం పొందిన నయా హిరణ్యాక్షుడికి

నీ మూడో నేత్రంతో మాడి మసిచేసావు!

పావురాల గుట్టకు మా పడి పడి దండాలు..

నీకు మా పొర్లు దండాలు తల్లి.

Friday, August 28, 2009

ఎర్ర కలువ


నిటారుగా నిలబడి గుండెలనిండుగా
ఊపిరి పీల్చుకొని
కాళ్ళు రెండూ నేలపై బలంగా అదిమి
మీ కళ్ళలో కళ్ళుపెట్టి చూడాలన్న
నా కోరిక ఈ తరానికి సాధ్యమా?

తరతరాలుగా నా భూమిని
నా సర్వాన్ని నీ హక్కుభుక్తం చేసుకొని
కోటి పడగల నాగుబామువై
భూమండలాన్ని చుట్టేసుకున్నావు...

అనాదిగా బానిసత్వపు సంకెళ్ళను
నా మెడలో వేసి నన్ను పాతాళంలోకి
నెట్టివేసి అధికారాన్ని అనుభవిస్తున్నావు...

కానీ...
అణచబడ్డ నా తరం అంతరంగ సునామీలోంచి
ఉద్భవించే పెనుతుఫాను తాకిడికి
నీ అధికార పీఠం తలకిందులవుతుంది...

అవమానాల ఊబిలోంచి
ఎర్రకలువ పూస్తుంది!

Monday, August 17, 2009

అతడు అక్షరానికి మాతృదేశం

త్రిపురనేని శ్రీనివాస్ తెలుగు సాహిత్యంలో ఒక సంచలనం. తన కవితా దాహంతో జీవితమంతా ్జీవించినవాడు. ఎన్ని విమర్శలనెదుర్కొన్నా తన కవితాయాణాన్ని కొనసాగించి తెలుగులో ఒక సంచలనాన్నే సృష్టించినవాడు. అకాల మృత్యువాతకు గురై మనలందరిని ఒంటరివాళ్ళను చేసి పోయాడు. ఆయన కవితా పాదాలు కొన్ని స్మరించుకుందాం.

ఒకరి వెనుక నడవటం చేతకాదు
నీడ కింద ఆలోచన కదలాడదు
లోపల సరస్సులున్న మనిషి
బయట సముద్రాల్ని సృష్టిస్తాడు
ఆకాశానికి ఆలాపన నేర్పుతాడు
అతడు ఎవరి వెనుకా నడవడు.

.అస్తమయం తర్వాత నేను నిజంగా మనిషిని
శత్రు శిబిరం వెనుక మాటువేసిన శరీరాస్త్రాన్ని
ఆఖరి సూర్యకిరణం భూమిని చేరిన క్షణం
నిలువెత్తు శోకధాత్రిని రహస్యోద్యమమై వేటాడుతాను

. కవిత్వం కావాలి కవిత్వం
అక్షరం నిండా జలజలలాడిపోయే
కవిత్వం కావాలి కవిత్వం

అలా ఒక వాక్యం చదవగానే
శత్రువు ఠారెత్తిపోవాలి
అమాయకుడు ఆయుధమై హోరెత్తిపోవాలి

తుప్పల్ తెప్పల్ మాటల్ రాల్చి కవిత్వమని మొరాయించకు
కవిత్వాన్ని వంచించకు
వచనమై సోలిపోతావ్ ...

. అవును నిషేధించిన అక్షరం మీదే నాకెప్పుడూ మోజు
తపనతో కాలే మెదడుకి అవే స్వప్నాలు...
ఆంక్షలో విజృంభణ నాకు కొత్తకాదు!

. మౌనం నిస్త్రాణకాదు
నివురుగప్పిన వ్యూహం
మౌన పరీవృత శిల్పి చెక్కిన నిశ్శబ్ద సవ్వడి
సంస్పందనాంతరమ్లోకి నైరూప్య వాక్యాలాపన
మొఉన పరాజయారణ్యరోదన కాదు
మాటలు లేని ఎడారి మైదానంలో అగ్నివృక్షం
రూపరహిత ప్రస్థాన సారాంశం
మౌనం అవ్యక్త మరణం కాదు
భాషా ప్రమేయం లేని నిగూఢ భావ హర్మ్యావరణం
విశ్వాంతర్గోళ ఆదిమ వ్యాకరణం.

౫.అరచేతికి రక్తం అంటకుండా చేసిన హత్యే ఆత్మహత్య
ఆత్మహత్యలన్నీ హత్యలే.

౬. సముద్రం నుంచి
పల్చటి నీటిపొర కత్తిరించి
ఆకాశమ్లోకి విసిరేస్తే
ఒక మబ్బు
ఒక వాన
ఒక తొలకరి

బాధ నుంచి
బరువైన విశ్వాసాన్ని మొసుకొచ్చి
మనుషుల్లోకి విసిరేస్తే
ఒక కవిత్వం
ఒక తిరుగుబాటు
ఒక మార్పు.

౭. కొత్తగా ఊహింనిదే నేనెప్పుడూ జీవించలేదు
అద్దాలను బద్దలు చేయనిదే నేనెప్పుడు విశ్రమిచను

వెన్నెల కురిసినా చంద్రుడిని ప్రేమిచలేను
దగ్ధమైనా సూర్యుడినే కౌగలించుకుంటాను..

౮. ఎవరి రెక్కలతో వారు ఆకాశాన్ని లొంగదీసుకోవాలి
సాక్షాత్తు సూర్యుడి గుండెలపై తప్పతడుగులు వేయాలి
....
ఎవరి రక్తచలనంతో వారు ఖద్గచాలనం చేయాలి.

Wednesday, August 12, 2009

వెన్నెలదారిలో....


ఇక్కడ మాయా లేదు మర్మం లేదు
కుట్రలు కుహకాలు కలికానికి కూడా లేవు
పండు వెన్నెలలాంటి నవ్వులే
కరచాలనాలతో మొదలయిన పరిచయం
కలసి నడిచే జీవనశైలిగా మారుతుంది!

నిరంతరం అలోచనల సంఘర్షణ-ఐక్యత
సూత్రంతో కట్టుబడి వుంటాం
వెన్నంటివుండే ఆయుధానికి పట్టిన
మురికిని వదిల్చే రోజువారీ పని
మా మెదళ్ళతో పాటే మనసుకూ వుంటుంది
అది మితృల చిరునవ్వులపై ప్రతిఫలిస్తుంది

నిత్యం మెడపై వేలాడే కత్తి పదును
మమ్మల్ని అప్రమత్తుల్ని చేస్తుంది

ఇక్కడ మాయాలేదు మంత్రం లేదు
ఆచరణ నుండి అనుభవం
అనుభవం నుండి జ్ణానం
జ్ణానం నుండి ఆచరణ
మా నడతను సరిచేస్తుంటాయి

పారే సెలయేళ్ళ గల గలలు
ఎగిరే పక్షుల రెక్కల కిల కి్లారావాలు
వీచే గాలిలోని అడవి పూల పరిమళం
జీవన సౌందర్యాన్ని ఆవిష్కరిస్తూ
పదం పదం కలిసి సాగే పల్లవి అవుతుంది

ఇక్కడ కాచిన వెన్నెల వృధా కాదు
రేపటి సూర్యోదయానికి భరోసా...

Saturday, August 8, 2009

క్షమించు కన్నా...

అమ్మా అని నోరారా పిలిచేందుకు
నీవు ప్రయత్నిస్తున్నప్పుడే
మమ్మీ డాడీ అనమని నీ
చెవి మెలిపెట్టినందుకు
నన్ను క్షమించు కన్నా..

నీవు బుడిబుడి నడకలు నేర్చుతున్నప్పుడే
నీ వీపున బండెడు బరువుగల సంచి
తగిలించినందుకు
నన్ను క్షమించు కన్నా..

కాన్వెంటు కంచె వెనకాల నిన్ను
విడిచి వచ్చిన క్షణం నీ చూపుల వెనక
దాగి వున్న ఆర్తిని గుర్తించలేని
నా అంధత్వాన్ని
క్షమించు కన్నా...

ఎదిగీ ఎదగని నీ పాదాలను
నల్లబూట్లలో కుక్కి నీ నెమలి
కంఠానికి నల్లని టై బిగించి
విసురుగా నిన్ను రిక్షాలో కుక్కి
పంపిన క్షణం నీవు సాచిన చేయిని
అందుకోనందుకు క్షమించు కన్నా...

తొలిజాములో మెల మెల్లగా నా
గుండెలలో దాక్కుని నిదుర పోయేందుకు
దాగిన నిన్ను మిగిలిన హోం వర్కు
చేసేందుకు నెట్టినందుకు
క్షమించు కన్నా...

ఉత్సాహంతో ఉరకలు వేస్తూ హాయిగా
సాగాల్సిన నీ కౌమారాన్ని
జైలు కంటే ఘోరమైన కార్పొరేట్ కాలేజీ
సెల్ లో వేసి ప్రపంచం తెలియకుండా
చేసినందుకు నన్ను క్షమించు కన్నా...

చదువు చదువు తప్ప లోకం
తెలియని నీ కనుల వెనుక దాగిన
ఒంటరి కన్నీటి చుక్క
నా కోసం దాయమని
వేడుకుంటున్నా....

(ఈరోజు నా సాగర్ పుట్టిన రోజు. వాడికి నా కన్ఫెషన్ ఇలా..)

Tuesday, August 4, 2009

స్తూపం మీది పేర్లు


వాటిని చదువుతుంటే
మీ రూపు కనులముందు కదలాడుతోంది
అవి మీ పేరులు మాత్రమేనా
వెయ్యేళ్ళ యుద్ధ నావను నడిపిన
సరంగుల ఆనవాళ్ళు!
జనం గుండెల్లో గూడు కట్టుకున్న
పోరాట రూపాలు!
ప్రవహించే ఉత్తేజపు అలల సవ్వడి
వినబడుతోంది
మా నరాలలో లావా ఉరకలెత్తుతోంది
మా దేహం సంధించిన బాణమవుతో౦ది

తెగిపడిన మీ క౦ఠనాళాలలో౦చి
కదంతొక్కుతూ పదంపాడుతూ
పదండి ముందుకు అంటూ సాగిన
విముక్తి గీతాలాపన హోరు...

పచ్చని పైరు మీదుగా వీచిన గాలి తిమ్మెర
ఏదో చల్లని కబురు చెవిలో
చెప్పిన అనుభూతి!
మీ నవ్వుల హరివిల్లులు నలుదిశలా
పరుచుకున్న ఆనందహేల!

కొన్ని విజయాలు మాత్రమేనా...
శతాబ్దాల బానిస సంకెళ్ళు తెగిపడిన
జయజయధ్వానాలు!

మీ పేర్లు స్తూపం మీదేనా?
కాదు జాతి విముక్తి పోరాట
చరిత్ర పుటల్లో నెత్తురంటిన
పేజీల నిండుగా!

మీ అమరత్వం రేపటి
సూర్యోదయానికి అరుణిమను
పూసింది...
(ప్రజలకోసం దేశ బానిస సంకెళ్ళను తెగ్గొట్టే పోరాటంలో అమరులైన ప్రజా యుద్ధ వీరుల స్మృతిలో)

Sunday, July 26, 2009

తల్లిద౦డ్రులకు నమస్కారం

నేను కేర్మన్నంతనే
నా గొంతులో అమృతపు
చుక్కలు పోసి
పొత్తిళ్ళలో సేదదీర్చిన
నిన్ను ఎలా మరువగలనమ్మా
నీ వేలి చివరి ఆసరాతో
నీ అడుగులో అడుగునై
నేర్చానీ నడక
అమ్మా అన్న బీజాక్షరాలలోంచే
భాష నేర్చుకొన్నాను
నీ లాలిపాటలలోని
కరుణామయ పల్లవులే
నాకవిత్వం!

తండ్రీ నీ కష్టానికి ప్రతిరూపమే
యీ దేహం
నీ కనురెప్పల మాటున
రూపొందిన నా భవిష్యత్
చిత్రపటం నీకే అంకితం

మడమ తిప్పని నీ సాహస పోరాట
తత్త్వం మమ్మల్ని వెన్నంటి
ఉంటోంది

మీ పేగు ఋణం జన్మకు
తీరేనా?

(పేరెంట్స్ డే సందర్భంగా)

Thursday, July 23, 2009

తొలకరి - ఉభాలు


వేసవన్నాల్లు కుత కుత ఉడికిన మట్టి
తొలకరి చినుకులు కురవగానే
వెదజల్లే
పరిమళం
ముక్కు
పుటాలను తాకగానే
నాలోని ఆదిమ తత్వం ఒక్కసారిగా మేల్కొని
నన్ను ఆనంద సాగరంలో ముంచెత్తుతుంది

వానజల్లుతో
పులకరించిన పుడమి తల్లి
ఏరువాక
సాగగానే
ఒడలంతా గుల్లబారి
తనలోకి వంగడపు విత్తనాన్ని
ఆహ్వానించి చిగురువేసే దృశ్యం
ప్రకృతంతా పచ్చని
పున్నమి
వెన్నెలాకాశం!

Tuesday, July 14, 2009

స్పేస్ ఫర్ కమ్యూనికేషన్


జీవితం ఎం. . ఫారంలోని
స్పేస్ ఫర్ కమ్యూనికేషనంత
కుదించుకుపోవడం
ఎంత విషాదమోగదా!
చిన్ని జాగాలోనే క్షేమ సమాచారాలు
పలకరించుకోవడాలు
చేసేంత మరుగుజ్జుతనం
ఎంత దౌర్భాగ్యం!

ఒకరినొకరు హృదయం విప్పి
పలకరించుకోలేనితనం
ప్రతిమాటకు ఏదోకనబడని
తెర అడ్డుపడుతుండడం
అంతా సవ్యంగా సాగిపోతుందని
అనుకోలేని వెన్నాడుతున్న
పిరికితనం
కనుచూపుమేరా చూసిన దృశ్యం
కంటివెనకాల అదృశ్యం
అంటీ ముట్టనట్టు కరచాలనం!

ఎందుకింత అబద్దం
రాజ్యమేలుతోంది!
మంచుతెర కమ్ముకుంటూ
గుండె కవాటాలను
బిగదీస్తోంది!!

Wednesday, July 8, 2009

ఎప్పుడైనా?

ఎప్పుడైనా గొంతులోంచి బిగ్గరగా అరిచి నీ ఎదురుగా జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించావా?
ఎప్పుడైనా నీవు ప్రయాణిస్తున్న పడవ ఆవలి ఒడ్డుకు చేరేలోపు సుడిలో చిక్కుకుందా?
ఎప్పుడైనా నీవు నదిలో దిగినపుడు నీ కాలికింద ఇసుక కోతకు గురై పీకల్లోతు నీటిలో మునిగి బయటపడ్డావ?
ఎప్పుడైనా మీ ఇల్లు తగలబడి కట్టుబట్టలతో మిగిలి మళ్ళి మొదలయ్యావా?
ఎప్పుడైనా గాలికి నీ ఇంటి పైకప్పు ఎగిరి, గోడలు కూలి ధారాపాతంగా కురుస్తున్న ముసురులో మూడురోజులు పస్తులున్నావా?
ఎప్పుడైనా సకాలంలో వర్షం కురవక ప౦టకొచ్చిన పొలం ఎండి పోయి ఏడాదంతా ఏమి చేయాలో పాలుపోని స్థితికి లోనయ్యావా?
ఎప్పుడైనా చేతిలో చిల్లిగవ్వ లేకుండా కడుపులో పేగులు ఉండ చుట్టుకొని నొప్పితో బాధ పడ్డావా?
ఎప్పుడైనా నీ ఇంట్లోకి చొరబడి నీ నుదుటిపై తుపాకీ గురిపెట్టబడి౦దా?
ఎప్పుడైనా నీ వీధిలో తుపాకి కాల్పుల హోరు వినబడిందా?
ఎప్పుడైనా అకారణంగా నీ పెడ రెక్కలు వెనక్కి విరిచికట్టి నీ డొక్కలో గుద్ది నీ మెడపై బలమైన చేతులు వేసి తోసుకుంటూ జీపెక్కించారా?
ఎప్పుడైనా కర్ఫ్యూ విధించిన వీధిలో రాల్లదాడి జరిగి ఎటు కదలలేని స్థితికి లోనయ్యావా?
ఎప్పుడైనా నీ వాళ్ళెవరైనా అత్యాచారానికో, హత్యకో గురై సాక్ష్యం చెప్పేవాడు లేక నీ ముందే వాడు కాలరేగారేసుకు తిరుగుతున్న స్థితికి గురయ్యావా?
ఎప్పుడైనా నీ వాళ్లు తప్పిపోయి ఎటుపోయారో తెలియక మానసిక క్షోభ అనుభవించావా?
ఇవన్నీ కాదు మిట్ట మధ్యాహ్నం నీరందక తీవ్రమైన దప్పికతో నాలుక పిడచ కట్టుకుపోయే స్థితికి లోనయ్యావా?
ప్రశ్నలలో ఒక్కటికి గురైనా నీకు దు:ఖం గురించి తెలుస్తుంది..
(ఇవన్ని సామాన్యుడికి నిత్య కృత్యమైనాయి)

Thursday, July 2, 2009

నింగికెగసిన నేల తార



నిన్ను మరల మరల చూడాలని అనిపిస్తోంది

నిజానికి మనిషి బతికున్నప్పుడు లేని ఆప్యాయత

అనురాగం ఇలా బయటకు తన్నుకువచ్చేట్లు చేసే

ఆ మృత్యు మహారాజుకు వందనం

ఏమిటో నీ పాటలలోని సాహిత్యం ఎన్నడు నాకు

అర్ధం కాకపోయినా ఆ సంగీత ఝరి నా నరాలలో

విద్యుత్ ప్రవహింపచేసేది

నీ కదలికల వేగం నిజమేనా అని అనిపించేవి


విశ్వ వ్యాపితమైన నీ పాట మాధుర్యం

మరువనివ్వకున్నది

నీ జాతి జనుల స్వెచ్చా కాంక్షనీ మోములో

ప్రతిఫలించేది


నాకెందుకోగాని నీ యవ్వనంలోని నల్లనయ్య

రూపమంటేనే ఇష్ట౦
ఏమిటో మల్లీ నీవు వస్తావని మరలా

నీ మునివేళ్ళపై

ఈభూగోళాన్ని గిర గిరా తిప్పుతావని అనిపిస్తోంది
ఐ వాంట్ యు కం బాక్

Saturday, June 20, 2009

ఓ తడి ఆరని జ్ఞాపకం

నిన్న మొన్నటి జ్ఞాపకం
నా కంటి తెరచాపల మాటున కదలాడుతోంది
ఉబికిన కన్నీళ్లు-ఉగ్గబట్టుకున్న దుఃఖం
సుడులు తిరుగుతుండగా ఇప్పటికీ
మీ కరచాలనపు స్పర్శ వెచ్చగా
గుండె పొరల్లో దాగివుంది
పండు వెన్నెలలాంటి మీ నవ్వు
వాన వెలిసిన రాత్రి మబ్బుల
మాటునుండి తొ౦గిచూసిన
జాబిలి మోములో ప్రతిఫలిస్తుంది..

గలగలా పారే సెలయేళ్ళు
మీ మాటల ఉసులు విన్పిస్తున్నాయి
వడివడిగా పారే వాగులు
మీ నడకలోని వేగాన్ని గుర్తుకు తెస్తున్నాయి
పచ్చటి వరిచేలు యూనిఫా౦గా మారి
మిమ్మల్ని గు౦డెల్లో దాచుకు౦టా౦ రారమ్మని
పిలుస్తున్నట్లుగా వున్నాయి
ఎత్తైన శిఖరాలు మీ నిబ్బరానికి
శిరసువంచి నమస్కరిస్తున్నాయి
తూర్పున ఉదయి౦చే సూరీడు
మీ అమరత్వపు అరుణిమను అద్దుకొని
మరింత ఎర్రబారుతూ
మాకు అభయమిస్తున్నాడు
మిత్రులారా మా గుండెల్లో దాగిన
మీ తడి ఆరని జ్ఞాపకాలూ
ఎప్పటికీ మీ నిర్మల త్యాగాన్ని
మరువనివ్వదు.....

Thursday, June 18, 2009

అతను... ఆమె... నేనూ....


రైఫిల్ భుజానేసుకుని అతను
వడివడిగా
వెనుక నేనూ ఆయాసపడుతూ....

చీకటిలో ఆయన నవ్వు
అడివంతా పరచుకున్న వెన్నెల
మిత్రమా... ఎన్నేళ్ళీ ప్రయాణం
అమ్మ కన్న కలలు సాకారమయ్యే౦త వరకూ....

అవును నిజమే
ఊరి గుమ్మానికి వేలాడుతున్న ఖ౦డితుని
శిరస్సు నవ్వే౦తవరకూ....

రైఫిల్ భుజానేసుకుని అతడూ ఆమె
వడివడిగా
నడిచినంతమేరా పచ్చదన౦తో
పుడమితల్లి పులకిస్తూ.....

ఎదుటివారి మౌనాన్ని బద్దలుకొడుతున్న
వారి పలకరి౦పు
భుజం కలుపుతూ ఆయాసాన్ని మాయం చేస్తూ
స్నేహంగా కరచాలనం....

ఝె౦డా భుజానేసుకుని అతడూ.. ఆమె.. నేనూ..
వడివడిగా.....
(అమరుల స్మృతిలో....)

Tuesday, June 16, 2009

విలక్షణ నటుడు డా.రాజే౦ద్ర ప్రసాదు గారికి అభిన౦దనలు

ఐఫా అవార్డుల వేడుకలో మన తెలుగు నటుడు డా.రాజేంద్ర ప్రసాదు గ్రీన్ కార్పెట్ ఆహ్వానం అందుకున్నందుకు అభినందనలు. ఆయన ఆ౦గ్లములో క్విక్ గన్ మురుగన్ సినిమాలో శాఖాహారాన్ని సమర్ధించే మురుగన్గా నటించినందుకు ఈ ప్రత్యెక ఆహ్వానం లభించింది. బిగ్ బి కుటుంబం అభినందనలు అ౦దుకున్నారు. ఇలా౦టి వేడుకలలో సాధారణ౦గా రెడ్ కార్పెట్ ఆహ్వానం వు౦టు౦ది. కానీ నిర్వాహకులు గ్లోబల్ వార్మి౦గ్ విషయంలో ప్రజలను చైతన్య పరిచే౦దుకు ఈ మారు గ్రీన్ కార్పెట్ పరిచారు. రాజే౦ద్ర ప్రసాద్ తన సినిమా గెటప్ లోనే వెళ్లి అ౦దరినే ఆకట్టుకునారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత రసూల్ పోకుట్టి ఆయనను దక్షిణాదిలో గొప్ప నటుడిగా పరిచయం చేసారు. ఇది తెలుగు వాళ్ళమంతా ఆయనను అభినది౦చాల్సిన సమయ౦.
(ఆ౦ధ్ర జ్యోతి సౌజన్య౦తో)

Monday, June 15, 2009

శ్రీ శ్రీ వర్ధంతి - జాతీయకవిగా గుర్తించాలి


ఈ రోజు మహాకవి శ్రీ శ్రీ వర్ధంతి. తెలుగు కవితా స్రవంతిని పేదవాడివైపు మళ్ళించి తెలుగు కవితను ఛందస్సుల బంధం నుండి విముక్తిగావించి నాలాంటి కవితా ప్రియులను లక్షలాదిగా ధైర్యంగా రాసేన్దుకు మార్గ౦ చూపిన వాడు శ్రీ శ్రీ. హీనంగా చూడకు దేన్నీ కవితామయమేనోయి అన్నీ అని వెన్నుతట్టిన మహాకవి శ్రీ శ్రీ. తాడిత, పీడిత,పతితుల, బాధా సర్ప్దద్రష్టుల వెతలను తీర్చడానికి జగన్నాధరధచక్రాలను భూమార్గం పట్టి౦చదానికి తన సాహిత్యం ద్వారానే కాక జీవితాన్నే పణంగా పెట్టినవాడు శ్రీ శ్రీ. ఈ శతాబ్దపు కవిగా ఈ యుగం నాదే అని సగర్వంగా ప్రకటించుకున్న శ్రీ శ్రీని జాతీయ కవిగా నేడైనా ప్రకటింప చేయాల్సిన అవసరం మన తెలుగువాళ్ళ బాధ్యత. సుభ్రమణ్య కవిని జాతీయ కవిగా ప్రకటింపచేసుకున్నతమిళ సోదరుల తెగువ మనకు లేకపోవడం శోచనీయం. మనవాళ్ళను మనం గుర్తించడంలో మనకు వున్నన్నిసషబిశాలు వేరెవరికీ వు౦డవనుకు౦టాను. తన జీవితకాలమంతా ప్రజల వైపు, ప్రజల పోరాటాల వైపు నిలబడి పౌరహక్కుల ఉద్యమ నాయకుడుగా, విప్లవ రచయితల స౦ఘ౦ వ్యవస్థాపకుడిగా తెలుగు సాహితీ ర౦గ౦లో అరునతారగా వెలుగొ౦దిన మహా వ్యక్తీ శ్రీ శ్రీ. ఆయన స్ఫూర్తిని కొనసగి౦చడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి . a౦దుకో శ్రీ శ్రీ మా అరుణారుణ జోహార్లు.

Sunday, June 14, 2009

ఒకటే జననం ఒకటే మరణం


తల్లి గర్భంలో ఒకే పిండాన్ని పంచుకు పుట్టారు
ఉమ్మనీరులో చేయి చేయి కలిపి ఈదులాడారు
ఒకే పేగు బంధంతో తొమ్మిది నెలలూ
కలిసి పంచుకున్నారు
ఎవరు ముందు క్షణం ఈ లోకంలోకి
మాయ పొరను చీల్చుకు వచ్చారో!
ఒకే రొమ్ము పంచుకుని పెరిగిన తీపి
జ్ఞాపకాలను మరువలేకున్నాం
బాల్యమంతా ఒకరికి ఒకరు పోటీపడి

అమ్మతో దోబూచులాడిన క్షణాలు
ఇంకా మా మదిలో కదలాడుతూనే వున్నాయి
నాన్న తెచ్చిన బూందీ పొట్లం పంచుకు తిన్న

తీపి గురుతులు మరువలేకున్నాం
ఇద్దరూ ఒకే పుస్తకాన్ని చదువుకున్న

జ్ఞాపకాల తడి ఇంకా అరనేలేదురా
మీ దేహాలు వేరయినా విజ్ఞానంలో కూడా
ఏకత్వాన్నే నిలిపారు
ఒకే సైకిల్ పై ప్రతి రోజూ కాలేజీ పయనమయ్యే మీరు
మృత్యు ఒడిలోకి ఒకే సైకిల్ పై వెళతారు అని
ఎలా కలగనగలం కన్నా?
(నిన్నను అనకాపల్లి - చోడవరం రోడ్డులోని ఏలేరు కాలువ గట్టుపై జరిగిన ట్రాక్టర్ గుద్దిన ఘటనలో సైకిల్ పై వస్తున్న కవల సోదరులు రాంకిశోర్, లక్ష్మనకిశోర్లు మృత్యువాత పడ్డారన్న వార్త చదివి. వారిద్దరి జన్మదినం ఈరోజని తెలిసి గుండెలు పిమ్దినట్టాయి. ఇంటర్లో ఇద్దరూ ప్రధమ శ్రేణిలో పాస్సయ్యారు.)

Thursday, June 11, 2009

కన్నీటి చినుకులు


నిన్ను చూడగానే
పసితనంలో నీవుకూడా నా
చిన్నారి చెల్లెలా అమ్మకొంగు పట్టుకొని
ఆడిన దోబూచులాటలు గుర్తొచ్చాయి

మా ఊరి పచ్చని పొలాల గట్ల వెంట
పట్టు పరికినీలతో పరుగులిడిన నా
చిన్నారి గజ్జెల సవ్వడి వినబడుతూంది

నీ రెండు కళ్లు మా ఊరి నీలాటి
రేవును గుర్తుగా చూపెట్టాయి

ఎ గాలానికి చిక్కిన బంగారుపాపవో
ఈ చెరలో చెరచబడుతున్నావు

శుష్కించిన నీ దేహంలో
వీర్యస్నానమాడుతున్నారు

ఎదలోని ఆవేదనను వడలిన
కనురెప్పలక్రి౦ద దాచుకు౦టూ
ఎప్పుడూ వాడని గులాబీలా
పెదాలపై ఎరుపునవ్వుతో
స్వాగతిస్తావు!

మెరుపుల నీ చీర వెనుక మేడిప౦డు
సమాజాన్ని దాచేస్తూ తలుకులీనుతావు

ఎన్నో యదార్ధ వ్యథార్త జీవన శకలాలని నీ
రె౦డు కాళ్ళ స౦ధ్యలో దాచిపెడుతూ
కర్మయోగిలా కదిలిపోతావు

మరుసటి క్షణం కోసం ఆర్తిగా
ఎదురుచూసే నీకు ఏమివ్వగలను
కలతపడ్డం కొత్తగాని నీకు
రె౦డు కన్నీటి చినుకులు తప్ప!

విసిరేయబడ్డ శుక్రకణాల చారికలలో
ఎక్కడో దాక్కున్న నా ముఖ చిత్రాన్ని
వెదుక్కు౦టున్నాను ......

Wednesday, June 10, 2009

స్వప్న మేఘం


ఒక స్వప్న మేఘం
కరిగిపోతూ
అందరి హృదయాలలో
కన్నీటిని వర్షించింది
స్వప్న పధికుడు
మరెవరికీ అందనంత
దూరం వడివడిగా
నడుచుకుంటూ పోయాడు!
శోధన నాళికలో౦చి
స్వప్న లోకాల
పయనమయ్యాడు
శిరస్సు తెగిన దీపపు
స్తంభానికి తన
జీవన నౌక
లంగరు వేయగా
పెద్ద పెద్ద అంగలు
వేసుకు౦టూ పోయాడు
కానీ..
పైకి చూడు నీ
మనో నేత్రంతో
ఆయన వేలి చివరలను౦డి
రాలిన వెన్నెలాకాసంలో
మంచు శిల్పాలు
Related Posts Plugin for WordPress, Blogger...